HCU Lands | హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): ‘మీరు సీనియర్ ఐఏఎస్ అధికారి కదా.. చట్టాల గురించి తెలియదా? ఒక్కదానికీ మీరు సరైన సమాధానం చెప్పడం లేదు.. మీరు నిరక్షరాస్యులా? చదువుకోలేదా?’ అంటూ హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన సాధికార కమిటీ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఓ ఐఏఎస్ అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. హెచ్‌సీయూ భూముల విషయంలో పలు అంశాలపై వాకబు చేసిన కమిటీ సభ్యులు అక్కడ ఉన్న ఓ ఐఏఎస్ అధికారిని వివరాలు అడిగారు. ఏమి అడిగినా సదరు ఐఏఎస్ అధికారి సమాధానం చెప్పకపోవడంతో, ‘అధికారులు ఇలా వ్యవహరించడం సరికాదు. ఇలా మౌనంగా ఉంటే ఏదో జరిగినట్టుగానే భావించాల్సి వస్తుంది’ అని వారు అన్నట్టు తెలిసింది.
కలెక్టర్లుగా పనిచేస్తున్నవారు బాధ్యతాయుతంగా ఉండాలని, సుప్రీంకోర్టు అడిగిన సమాచారం ఇవ్వడానికి ఇబ్బందేమిటని ప్రశ్నించినట్టు సమాచారం. అధికారులు ఇస్తున్న సమాచారం అసమగ్రంగా ఉంటున్నదని, ఇలాగైతే అధికారులపైనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేసినట్టు తెలిసింది. మొక్కల లెక్కలకు సంబంధించి కమిటీ సభ్యులు విచారణ జరుపుతున్నప్పుడు మొత్తం ఎన్ని ఎకరాల్లో చెట్లను తొలగించారని టీజీఐఐసీ అధికారులను, అటవీశాఖ అధికారులను అడిగారు. మొత్తం 49 హెక్టార్లలో భూమిని చదనుచేసే పనులు చేపట్టామని టీజీఐఐసీ అధికారులు జవాబిచ్చారు. వంద ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టినట్టు కూడా చెప్పారు. దీనిపై కమిటీ స్పందిస్తూ, 400 ఎకరాల భూమి ఉండగా కేవలం వంద ఎకరాలనే ఎందుకు అమ్మకానికి పెట్టారని ప్రశ్నించారు.
మార్కెట్ అసెస్మెంట్ చేయించామని, డిమాండ్‌ను చూసుకొని అమ్మకానికి పెట్టామని అధికారులు చెప్పారు. దీనికి కమిటీ స్పందిస్తూ, 49 హెక్టర్లలో పనులు చేస్తున్నారని, అంటే 50 హెక్టార్లు దాటితే ‘ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్’ (ఈఐఏ) చేయాల్సి వస్తుందని, దాని నుంచి తప్పించుకోవడానికి తెలివితేటలన్నీ ఉపయోగించి తొలుత 49 ఎకరాల్లో పనులు మొదలుపెట్టారని, 400 ఎకరాల్లో ఒకేసారి పనిచేయాలంటే కచ్చితంగా ఈఐఏ అవసరమవుతుందనే ప్రభుత్వం, అధికారులు భావించినట్టు కనిపిస్తున్నదని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈఐఎ నుంచి తప్పించుకోవడానికే ప్రభుత్వం తొలుత వంద ఎకరాల్లోనే చెట్లను కొట్టివేసినట్టు కనిపిస్తున్నదని వ్యాఖ్యానించినట్టు సమాచారం.
అటవీ శాఖ అధికారులు, టీజీఐఐసీ అధికారులు హెచ్‌సీయూ క్యాంపస్ వద్ద ఉన్న వంద ఎకరాల్లో కొన్ని చెట్లను కొట్టివేసినట్టు కమిటీ ఎదుట ఒప్పుకున్నారు. అయితే, అవన్నీ సాధారణ, చిన్న చిన్న పిచ్చిమొక్కలేనని, కొన్ని సుబాబుల్ చెట్లు కూడా ఉన్నాయని, మొత్తంగా 125 వివిధ జాతులకు సంబంధించిన చెట్లు ఉన్నాయని అధికారులు కమిటీకి వివరించారు. అధికారులు కొట్టేశామని చెప్తున్న 125 చెట్లకు సంబంధించిన వివరాలను, ఫొటోలను కమిటీ అడిగినట్టు తెలిసింది. అయితే, అధికారుల వద్ద ఆ సమాచారం లేదు.
కమిటీ అడిగిన ఫొటోలు, ఇతర ఆధారాలు కూడా టీజీఐఐసీ అధికారుల వద్ద లేవు. దీంతో టీజీఐఐసీ, అటవీ శాఖ అధికారులపై సాధికార కమిటీ చైర్మన్ సహా ఇతర సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇంత నిర్లక్ష్యంగా ఉన్న మీ పై పోలీసు కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించినట్టు సమాచారం. సైబరాబాద్ పోలీసులు అనుసరించిన విధానంపై కూడా సాధికార కమిటీ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. చట్టం అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత పోలీసులపై కూడా ఉంటుందని, చెట్లను తొలగిస్తున్న బుల్డోజర్లు, ఇతర యంత్రాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని, వాటితో చెట్లను నరికివేస్తుంటే కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించినట్టు తెలిసింది.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో రాష్ట్రానికి వచ్చిన సాధికార కమిటీ తన పరిశీలనలో వెల్లడైన అంశాలతో సుప్రీంకోర్టుకు ఒకటి, రెండు రోజుల్లో నివేదిక ఇవ్వనున్నది. ఈ నెల 16న సుప్రీంకోర్టులో హెచ్‌సీయూ భూములపై విచారణ జరగనున్నది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఏమైనా డైరెక్షన్ ఇస్తుందేమోనని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు. ఒకరిద్దరు అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నదని చెప్తున్నారు.