Formula E Case | హైదరాబాద్, జనవరి 15(నమస్తే తెలంగాణ): ఫార్ములా-ఈ రేసుపై ఏసీబీ నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని అభ్యర్థిస్తూ బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అప్పీల్ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేటీఆర్ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న బీ వరాలేతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం తుది ఉత్తర్వులు జారీచేసింది.
తొలుత కేటీఆర్ తరఫు సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, సిద్థార్ధ దవే వాదించారు. సుందరం వాదిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా, రాజకీయ దురుద్దేశంతో, ఏకపక్షంగా ఫార్ములా-ఈ రేసులో అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ ద్వారా కేసు నమోదు చేసిందని ఆరోపించారు. నిధుల దుర్వినియోగమే లేనప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(ఏ) కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదని వాదించారు. హైదరాబాద్ కీర్తి ప్రతిష్ఠలను విశ్వవ్యాప్తం చేసే క్రమంలో ఆ నాటి మంత్రి హోదాలో కేటీఆర్ ఫార్ములా-ఈ రేసును నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక రూపాయి కూడా కేటీఆర్‌కు చెల్లించనప్పుడు ఆ సెక్షన్ కింద ఏసీబీ ఎఫ్ఐఆర్ ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు.
ఒక నయాపైసా లావాదేవీలతో పిటిషనర్‌కు సంబంధం లేనప్పుడు అవినీతి జరిగిపోయిందంటూ ముందే ఒక నిర్ణయానికి ఎలా వస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పినట్టుగా అభియోగాలన్నీ కాసేపు నిజమేనని అనుకుంటే, నిధులు పొందిన సంస్థను గానీ, ఒప్పందం చేసుకున్న హెచ్ఎండీఏను గానీ నిందితులుగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపులు, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా రూ.54 కోట్ల చెల్లింపులు జరిగాయనే అభియోగానికి, సదరు 13(1)(ఏ)సెక్షన్‌కు ఏవిధంగా సంబంధమో అర్ధం కావడం లేదని పేర్కొన్నారు.
ఒప్పంద పత్రాలు, నిధుల చెల్లింపు లావాదేవీల పత్రాలు కూడా ప్రభుత్వం వద్ద ఉన్నాయని, ఈ నిర్ణయంలో లోపాలు, తప్పులు ఉంటే వాటిని ప్రభుత్వమే సరిచేయాలన్న విషయాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్ష నాయకుడిపై కక్ష సాధింపుతో కేసు బనాయిస్తే ఎలా? అని ఆర్యమ సుందరం ప్రశ్నించారు. ఫార్ములా- ఈ రేసు నిర్వహణ వల్ల ప్రభుతానికి రూ.700 కోట్ల మేరకు లబ్ధి చేకూరిన విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని తప్పుపట్టారు. పీసీ యాక్ట్ సెక్షన్ 13(1),(ఏ) కింద కేసు పెట్టడానికి నేరపూరిత ప్రవర్తన పిటిషనర్‌పై ఎకడా లేదని చెప్పారు.
ఒక ఆధారం కూడా ఏసీబీ దగ్గర లేకపోయినప్పటికీ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న కేటీఆర్‌ను ఇబ్బందులకు గురిచేయాలన్న దురుద్దేశం కనబడుతున్నదని తెలిపారు. హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టేయడం అన్యాయమని, హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరారు. స్పాన్సర్స్ వెళ్లిపోవడంతో ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం రాకూడదనే ఆనాటి మంత్రి హోదాలో పిటిషనర్ కేటీఆర్ చొరవ తీసుకుని ఫార్ములా- ఈ రేసు కొనసాగేలా చేయడమే నేరమా? అని ప్రశ్నించారు. లేని అవినీతిని ఉన్నదంటూ వర్తించని 13(1)(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేయడాన్నే ప్రశ్నిస్తున్నామని స్పష్టంచేశారు.
లీలావతి, చరణ్‌సింగ్ కేసుల్లో సుప్రీంకోర్టు జారీచేసిన తీర్పులకు విరుద్ధంగా ఫార్ములా-ఈ రేసులో తీవ్ర జాప్యంతో ఏసీబీ కేసు నమోదుచేసిందని ఆర్యమ సుందరం వాదించారు. గత డిసెంబర్ 18న సాయంత్రం 5.30 గంటలకు ఫిర్యాదు అందితే, ఆ మరుసటి రోజునే ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదుచేయడం చెల్లదని పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన తరువాత ఎలాంటి దర్యాప్తు చేయకుండానే ఆగమేఘాలపై కేసు నమోదుచేశారని వివరించారు.
ఫార్ములా- ఈ రేసు ఒప్పందంలో తప్పిదాలు, అక్రమాలు జరిగాయనేది ఫిర్యాదులోని అంశమని, మొత్తం రూ.54 కోట్ల చెల్లింపుల వ్యవహారంలో ఆర్థికశాఖ అనుమతి పొందలేదన్నది ఫిర్యాదులోని పూర్తి సారాంశమని సుందరం గుర్తుచేశారు. ఇది విధాన నిర్ణయమైనప్పుడు అందులో తప్పిదాలు, అక్రమాలు జరిగితే అందుకు బాధ్యత మంత్రిది కాబోదని, విధాన నిర్ణయానికి పూర్తి బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదే అవుతుందని వాదించారు. విధాన నిర్ణయాల్లో లోటుపాట్లు ఉంటే వాటిని ప్రభుత్వం సరిదిద్దుకోవాలని అన్నారు.
నిధులు అందుకున్న సంస్థను నిందితులుగా చేర్చలేదని సుందరం పేర్కొన్నారు. ఫార్ములా-ఈ రేసు నిమిత్తం ప్రభుత్వం, ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో),ఏస్ నెక్స్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరిందని, ప్రమోటర్ వెళ్లిపోవడంతో ప్రభుత్వమే చెల్లింపులు జరిపి రేసు నిర్వహణకు ఆమోదం తెలపడం విధాన నిర్ణయంలో భాగమని వివరించారు. నాటి మంత్రిగా ఉన్న పిటిషనర్‌పై కేసు నమోదు చెల్లదని తెలిపారు. వాదనల తర్వాత కేసు ఎఫ్ఐఆర్ దశలో ఉన్నందున జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో అప్పీల్ పిటిషన్ ఉపసంహకరణకు అనుమతి ఇవ్వాలని సుందరం కోరారు. ఇందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసింది.
నిధుల చెల్లింపులన్నీ బ్యాంకు ద్వారా, అదీ అధికారుల ద్వారా జరిగినప్పుడు అవినీతి ఎలా వర్తిస్తుందని పేర్కొంటూ కేటీఆర్ తరఫు న్యాయవాది మోహిత్‌రావు 430 పేజీల స్పెషల్ లీవ్పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఈ నెల 7న హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టేయడం అన్యాయమని పేర్కొన్నారు. బ్యాంకు ద్వారానే సొమ్ము చెల్లింపు జరిగిందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు. నిబంధనల ఉల్లంఘన నేరం కిందకు రాదని, అదీ క్రిమినల్ అభియోగాల కిందకు ఎలా వస్తుందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చెల్లదని తెలిపారు.
ఒప్పందం కొనసాగింపులో భాగంగా చెల్లింపులు జరిగాయని స్పష్టంచేశారు. ప్రభుత్వం అనేది శాశ్వతమని, గత పాలకులపై కక్ష సాధింపు, వేధింపులతో కేసులు పెట్టడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఫార్ములా సీజన్ 9ను పిటిషనర్ మంత్రిగా ఉండగా సమర్థంగా నిర్వహించారని, తర్వాత వచ్చిన ప్రభుత్వం ఫార్ములా రేస్ సీజన్ 10ను నిర్వహించలేదని తెలిపారు. రెండు విడతలుగా ప్రభుత్వం డబ్బులు చెల్లించిన తర్వాత మూడోదైన చివరి విడత చెల్లింపులకు ఆసారం ఉన్నప్పటికీ ప్రభుత్వం చేయలేదని వివరించారు.
దీంతో సీజన్ 10 నిర్వహించని ప్రభుత్వం ఆ వ్యవహారం నుంచి తప్పించుకునే క్రమంలో పిటిషనర్‌పై తప్పుడు కేసు నమోదు చేసిందని ఆరోపించారు. ఫిర్యాదులోగానీ, ఎఫ్‌ఐఆర్‌లోగానీ పిటిషనర్ కేటీఆర్‌కు ఎలాంటి దురుద్దేశం ఆపాదించలేదని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆస్తిని అన్యాక్రాంతం చేయడం లేదా వేరేవారికి అప్పగించడం వంటి విషయాలు ఇందులో లేవని స్పష్టంచేశారు. ఫార్ములా-ఈ నిర్వాహకులను ఎందుకు నిందితులుగా చేర్చలేదని ప్రశ్నించారు. ఒప్పంద అంశాలను సంబంధిత శాఖాధికారులే అమలు చేయాలని, వాటిని మంత్రి చేయరని తెలిపారు. ఫార్ములా-ఈ నిర్వహణకు 2023 సెప్టెంబర్ 27న కుదిరిన ముసాయిదా ఒప్పందంలో హెచ్ఎండీఏ ప్రమోటర్‌గా ఉన్నదని దగుర్తుచేశారు. కాబట్టి పిటిషనర్‌పై ఏసీబీ కేసు నమోదు అన్యాయమని పేర్కొన్నారు.