హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు ఇవ్వడంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. వాదప్రతివాదనల అనంతరం విచారణను ఈ నెల 16కు వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానం ప్రకటించింది. ఈ కేసులో ఈడీ తనను అకారణంగా గంటల తరబడి విచారించడం సరైనది కాదంటూ కవిత సుప్రీంను ఆశ్రయించారు. ఇటువంటి అభ్యంతరాలే గతంలోనూ పలువురు లేవనెత్తడంతో అన్నింటినీ కలిపి ఒకేసారి విచారించాలని ధర్మాసనం నిర్ణయించింది. గత విచారణలో నళినీచిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో కవిత కేసును సుప్రీంకోర్టు జతపరిచి విచారించింది. సోమవారం దీనిపై తుది విచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. స్పందించిన న్యాయస్థానం వేర్వేరు కేసుల్లో గతంలో ఇచ్చిన తీర్పులను, ఉత్తర్వులను పరిశీలించాల్సి ఉన్నదని పేర్కొన్నది. మరోవైపు, ఈడీ తరఫు న్యాయవాది మాట్లాడుతూ కవిత సమన్లు తీసుకోవడం లేదని, విచారణకు రావడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సమన్లు జారీచేయబోమని గత విచారణలో ఈడీ చెప్పిన విషయాన్ని కపిల్ సిబల్ గుర్తు చేయడంతో, అది ఒక్కసారికే పరిమితమని ఈడీ న్యాయవాది స్పష్టం చేశారు. అసలు ఈడీ నోటీసులే చట్టవిరుద్ధమని కపిల్ సిబల్ వాదించడంతో అన్ని విషయాలను 16న విచారణలో పరిశీలిస్తామని కోర్టు తెలిపింది.