రవీంద్రభారతి, నవంబర్ 17: దళితుల సంక్షేమం కోసం కృషిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని మాల సంఘాల రాష్ట్ర జేఏసీ చైర్మన్ చెరుకు రాంచందర్ స్పష్టంచేశారు. అమలుకు నోచుకోని హామీలు ఇస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమం కోసం వినూత్న పథకాలను అమలు చేసిన దేశంలోని ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఏ రాజకీయ పార్టీ కూడా దళితులను పట్టించుకోలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతికి దళితబంధు ద్వారా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందజేశారని కొనియాడారు.
నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారని, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా లేని తీరులో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించిన సీఎం కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని మాలలందరూ కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జేఏసీ కో కన్వీనర్ నల్లాల కనకరాజు, ప్రతినిధులు తాళ్లపల్లి రవి, రాహుల అంజయ్య, డాక్టర్ యం భాస్కర్, టీ అనిల్, వినోద్‌కుమార్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.