హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలో కల్లుగీత వృత్తి పునరుద్ధరణ కోసం ఆ రాష్ట్రంలోని ఈడిగ, గౌడ కులస్తులు సాగిస్తున్న ఉద్యమానికి మద్దతుగా తెలంగాణలోని గౌడ సంఘాలు పోరాడనున్నట్టు రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం కర్ణాటకలో పర్యటిస్తున్న ఆయన.. గీత వృత్తి పునరుద్ధరణ కోసం స్వామి ప్రణవానంద చేపట్టిన మహాపాదయాత్రను శుక్రవారం మంగళూరులో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కుల వృత్తులకు సీఎం కేసీఆర్ పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నారని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కర్ణాటకలోనూ అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి జనార్దన్ పూజారి, ప్రముఖ సినీ నటులు సుమన్ తల్వార్, నితిన్ గుత్తేదార్, బాలరాజ్ గుత్తేదార్, పల్లె లక్ష్మణరావుగౌడ్, బాలగోని బాలరాజ్‌గౌడ్, రామారావుగౌడ్, వేములయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.