కరీమాబాద్, ఫిబ్రవరి 27: వరంగల్ నగరం భట్టుపల్లి రోడ్డులో డాక్టర్ సుమంత్‌రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్‌చేశారు. గురువారం మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ నందిరాం వివరాలు వెల్లడించారు. వరంగల్‌కు చెందిన డాక్టర్ సుమంత్‌రెడ్డి.. ఫ్లోరామరియాను 2016లో ప్రేమవివాహం చేసుకున్నాడు. 2018లో సంగారెడ్డికి షిప్ట్ అయ్యారు. సుమంత్‌రెడ్డి పీహెచ్సీలో కాంట్రాక్టు పద్ధతిని డాక్టర్‌గా పనిచేస్తుండగా ఫ్లోరా అతడి బంధువుల స్కూల్లో టీచర్‌గా పనిచేసేవారు. ఫ్లోరాకు జిమ్ సెంటర్లో కోచ్ ఎర్రోళ్ల శామ్యూల్‌తో స్నేహం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఈ విషయం సుమంత్‌రెడ్డికి తెలియడంతో వరంగల్‌కు షిఫ్ట్ అయ్యారు. 2019లో ఫ్లోరా ప్రభుత్వ లెక్చరర్‌గా జనగామ జిల్లా పెంబర్తిలో ఉద్యోగంలో చేరింది. రంగశాయిపేటకు బదిలీకాగా వరంగల్‌లో నివాసముంటున్నారు. సుమంత్‌రెడ్డి కాజీపేటలోక్లినిక్ నిర్వహిస్తూ ఉదయం వెళ్లి రాత్రి వచ్చేవాడు. ఈ క్రమంలో ఫ్లోరా.. శామ్యూల్‌ను తరచూ కలుసుకోవడంతో భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవలు జరిగాయి. దీంతో ఫ్లోరా, శామ్యూల్.. కలిసి సుమంత్‌రెడ్డిని చంపాలని ప్లాన్చేశారు.
శామ్యూల్ తన మిత్రుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజ్‌కుమార్‌కు విషయం చెప్పి డాక్టర్‌ను చంపేందుకు సహకరిస్తే సంగారెడ్డిలో ఇళ్లు నిర్మించి ఇస్తానని చెప్పాడు. అందుకు గాను ఫ్లోరా రూ. లక్ష ఫోన్‌పే ద్వారా శామ్యూల్‌కు పంపగా, రూ. 50 వేలు రాజ్‌కుమార్‌కు ఇచ్చి మరో రూ. 50 వేలతో హత్య చేసేందుకు కావాల్సిన సామగ్రి కొనుగోలు చేశారు. ఈ నెల 20న కానిస్టేబుల్, శామ్యూల్ బైక్‌పై కాజీపేటకు వచ్చి రెక్కీ నిర్వహించారు.
సుమంత్‌రెడ్డి ఇంటికి వస్తుండగా కారును అడ్డగించి విచక్షణారహితంగా దాడిచేయగా తీవ్రంగా గాయపడి కింద పడిపోగా చనిపోయాడని భావించిన ఇద్దరూ అక్కడినుంచి వెళ్లిపోయారు. స్థానికులు గమనించి సుమంత్‌రెడ్డిని దవాఖానకు తరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మిల్స్‌కాలనీ పోలీసులు విచారణ చేపట్టి ఫ్లోరా, శామ్యూల్, ఏఆర్ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
వరంగల్ చౌరస్తా : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన ప్రియుడితో కలిసి భార్య ఫ్లోరామరియా హత్యాయత్నం చేయగా తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న డాక్టర్ సుమంత్‌రెడ్డిని గురువారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఆర్ఐసీయూ న్యూరో విభాగంలో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. తలపై గాయం కారణంగా తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యాధికారులు తెలిపారు.