TG Film Chamber | తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ నియామకమయ్యారు. హైదరాబాద్‌లోని తెలంగాణ ఫిలిం చాంబర్లో శనివారం జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఇందులోనే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మరోసారి అధ్యక్షుడిగా సునీల్ నారంగ్ ఎన్నికవగా.. ఉపాధ్యక్షులుగా రవీంద్ర గోపాల్, కే ఉదయ్ కుమార్‌రెడ్డి ఎన్నికయ్యారు. వీఎల్ కార్యదర్శిగా శ్రీధర్ , జాయింట్ సెక్రటరీగా జే చంద్ర శేఖర్ రావు ఎంపికయ్యారు. బీ సత్యన్నారాయణ గౌడ్‌ను ట్రెజరర్ ఎన్నుకున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా 14 మంది నియామకమయ్యారు. ఈ సందర్భంగా సునీల్ నారంగ్ మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ సినిమాను ఆపే దమ్ము ఎవరికీ లేదన్నారు. పవన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మెచ్చుకున్నారని.. ఫిల్మ్ చాంబర్లో జరిగిన సమావేశంలో తాను లేనన్నారు. థియేటర్లలో బంద్ వార్త తాను విని ఆశ్చర్యానికి గురయ్యానన్నారు. సినీ సమస్యలపై ఒక కమిటీ వేశామని, కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
ఇండస్ట్రీలో ఆ నలుగురు అనేది ఇప్పుడు లేదని.. అది పదేళ్ల కిందటే ఉండేదని.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది యాక్టివ్‌గా ఉన్నారన్నారు. ఏడాదికి 50-60 సినిమాలు రావాలని కోరుకుంటామని.. 150 కోట్ల జనాభాలో మనకు గట్టిగా 30-40 మంది నటులు లేరన్నారు. ఉన్న నటులకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతామని ప్రశ్నించారు. నటుల రెమ్యునరేషన్ గురించి మాట్లాడే హక్కు మాకు లేదన్నారు. నటీనటులు ఎక్కువ సినిమాలు చేయాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. ఏ వ్యాపారమైనా డిమాండ్, సప్లయ్పైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఫిల్మ్ చాంబర్ కార్యదర్శి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజ్ విధానం కోసం 2016 నుంచి పోరాడుతున్నామన్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లను కాపాడుకునేందుకు ఇబ్బంది పడుతున్నామని.. తాము మాత్రం థియేటర్లు బంద్ అని చెప్పలేదన్నారు. పవన్ కల్యాణ్ మూవీ కోసం థియేటర్స్ అన్ని ఖాళీగా ఉంచినట్లు చెప్పారు. జనవరి నుంచి ఇప్పటి వరకు కేవలం మూడు సినిమాలే హిట్ అయ్యాయని.. ఇలా ఉంటే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. హీరోలు రెండు సంవత్సరాలకో మూవీ చేస్తే సినిమా చేస్తుంటే థియేటర్స్ ఎలా నడుస్తాయన్న ఆయన.. హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలన్నారు.