గోవిందరావుపేట/పలిమెల/రామడుగు(చొప్పదండి), జూన్ 15: పంట దిగుబడి రాక, చేసి న అప్పులు తీర్చే మార్గం లేక తీవ్రమనస్తాపం తో రాష్ట్రంలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చే సుకున్నారు. ఈ ఘటనలు ములుగు, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాకు చెందిన చిలుకపాటి సాంబశివరావు (46) తన పదెకరాల్లో పంట పండిస్తున్నాడు. మూడేండ్ల నుంచి పంట సరిగా పండక అప్పుల పాలయ్యాడు. గత యాసంగిలో సాగుచేసిన వరి పంట కూడా దిగుబడి రాక మనస్తాపానికి గురై శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య బంధువుల ఇండ్లల్లో, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం మధ్యాహ్నం పస్రా సమీపంలోని చల్లగొర్ర వద్ద సొంత పొలంలో పురుగు మందు తాగి విగతజీవిగా పడి ఉన్నాడు. మృతుడి భార్య స్వాతి ఫి ర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పస్రా ఎస్సై కమలాకర్ తెలిపారు.
భూపాలపల్లి జిల్లాలో పురుషోత్తం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం సర్వాయిపేటకు చెందిన దందెర పు రుషోత్తం (28) నిరుడు 1.20 ఎకరాల్లో మిర్చి పంట సాగుచేశాడు. ఆశించిన దిగుబడి రాక అప్పులపాలయ్యాడు. వీటిని తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురై శనివారం పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన మహదేవపూర్ సామాజిక దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు.
కరీంనగర్ జిల్లా దేశరాజుపల్లిలో..
కరీంనగర్ జి ల్లా రామడుగు మండలం దేశరాజుపల్లికి చెందిన క త్తెరపాక కనుక య్య(45) గ్రా మంలో ఐదెకరాల భూమిని ఐదేండ్లుగా కౌలుకు తీసుకొని సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిరుడు కురిసిన అకాల వర్షాలకు ఐదెకరాల్లో పంట నష్టం జరిగింది. పెట్టుబడి రాకపోవడంతో పాతవి, కొత్తవి కలిపి మొత్తం రూ.8 లక్షల అప్పు అయింది. ఎలా తీర్చాలోనని మనస్తాపం చెంది గత నెల 30న రాత్రి 11 గంటలకు కౌలుకు తీసుకున్న పొలం వద్ద పురుగు మందు తాగాడు. పొలానికి వెళ్లిన భర్త ఎంతకూ ఇంటికి రాకపోవడంతో అతని భార్య మణెమ్మతోపాటు కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. కనుకయ్యను వెంటనే కరీంనగర్లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి మరణించాడు.