హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా నిర్మించనున్న ఫోర్త్‌సిటీలో కొత్త జూపారును ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో రాష్ట్ర అటవీ అధికారుల బృందం రెండ్రోజుల క్రితం గుజరాత్ జామ్‌నగర్‌లోని ‘వన్‌తారా’ జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించింది. వివిధ అంశాలపై అధ్యయనం చేసిన అధికారులు నివేదికను రూపొందించారు. జూపార్క్ ఏర్పాటు లక్ష్యం, జంతువులు, వాటి సంరక్షణ కోసం చేపట్టాల్సిన సౌకర్యాలపై అధ్యయనం చేశారు. రెండు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఓ సీనియర్ అటవీ అధికారి తెలిపారు.
200 ఎకరాల్లో జూపార్క్..
ప్రభుత్వ ప్రతిపాదిత ఫోర్త్‌సిటీ చుట్టుపకల సుమారు 18 వేల ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. తాడిపర్తి, మద్విన్, కురుమిద్ద, కడ్తాల్, నాగిలి అటవీ బ్లాకుల పరిధిలో 15 వేల ఎకరాల అటవీ భూమి ఉంది. గుమ్మడవెల్లి అటవీబ్లాక్లో మరో 2 వేల ఎకరాల రిజర్వ్ అడవి ఉంది. ఈ అటవీ బ్లాకులకు ఆనుకుని ఉండే రెవెన్యూ భూమిలో జూపారు ఏర్పాటుకు ప్రభుత్వం సూత్రపాయంగా నిర్ణయించింది. ఫోర్త్‌సిటీలో 200 ఎకరాల్లో జూపారు ఏర్పాటుచేసి దానికి అనుబంధంగా వెయ్యి ఎకరాల అటవీ ప్రాంతాన్ని గ్రీన్బెల్టుగా చూపాలని భావిస్తున్నది. ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులు, నిర్వహణను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటుచేయాలని భావిస్తున్నది. కాగా కొత్త జూపార్క్ ఏర్పాటు ప్రతిపాదనను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి వ్యతిరేకిస్తున్నారు.