హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): బీసీల డిమాండ్ల సాధన పోరాటంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో సోమవారం ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని సావిత్రీబాయి ఫూలే ఆడిటోరియంలో మార్చి 8న నిర్వహించనున్న ఓబీసీ యూత్ లీడర్షిప్ సమ్మిట్-2025 పోస్టర్‌ను ఓబీసీ మేథావులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఓబీసీ విద్యార్థులకు విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్లలో జరిగే అన్యాయాలపై పోరాడాలని సూచించారు.
జనాభా దామాషా ప్రకారం ఓబీసీలకు చట్టసభల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల సాధనకు పాటుపడాలని కోరారు. బీసీల జనాభా విషయంలో కచ్చితమైన లెక్కతేల్చకపోవడం వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదని విమర్శించారు. దేశవ్యాప్తంగా జనగణనతోపాటు కులగణన చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామని తెలిపారు. ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో యువత రాణించేలా మార్గనిర్దేశం చేసేందుకు యూత్ లీడర్షిప్ సమ్మిట్ 2025 సదస్సు దోహదపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో జాతీయ ఓబీసీ నేత, బీపీ మండల్ మనమడు ప్రొఫెసర్ సూరజ్‌యాదవ్ మండల్, ఉత్తరప్రదేశ్ మాజీ ఎంపీ శ్యామ్సింగ్ యాదవ్, ఒడిశా ఎంపీ సుమిత్ పాత్ర, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మస్తాన్‌రావు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సందీప్‌కుమార్, బనారస్ హిందూ యూనివర్సిటీ ఓబీసీ నాయకులు ప్రొఫెసర్ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.