పెద్దమందడి/వనపర్తి టౌన్, డిసెంబర్ 7 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీల్లో పాల్గొన్న ఓ విద్యార్థి కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. శనివారం వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా.. పెద్దమందడి మండలం బలిజపల్లి, జంగమాయపల్లి జంట గ్రామాల ఉన్నత పాఠశాలలో పాఠశాల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహించారు. అదే పాఠశాలలో చదువుతున్న ముందరితండా (పామిరెడ్డిపల్లితండా)కు చెందిన టెన్త్ విద్యార్థి సాయిప్రణీత్ (16) శనివారం వాలీబాల్ ఆడుతూ కళ్లు తిరుగుతున్నాయని చెప్పి కిందపడిపోయాడు. వెంటనే ఉపాధ్యాయులు వనపర్తి దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే ఉదయం ఒకసారి కండ్లు తిరుగుతున్నాయని విద్యార్థి చెప్పడంతో అతడి తల్లి లీలమ్మ దవాఖానలో చూపించి పాఠశాలకు పంపించింది. ఈ క్రమంలో ఆట ఆడుతుండగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడి తండ్రి రవి దుబాయ్‌లో ఉంటున్నాడు. అతడికి అక్క, తమ్ముడు ఉన్నారు. సాయిప్రణీత్ కుప్పకూలిన ఘటనను చూసిన మరో విద్యార్థిని ప్రియ అపస్మారక స్థితికి చేరగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి
సాయిప్రణీత్ మృతిని నిరసిస్తూ వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్‌లో విద్యార్థి సంఘాల నేతలు రాస్తారోకో చేపట్టారు. బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ, గిరిజన విద్యార్థి సంఘం, పీడీఎస్‌యూ, ఎంఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కలెక్టర్ రావాలని, విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని నినదించారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాలుగు గంటలపాటు ధర్నా చేపట్టినా అధికారులు స్పందించకపోవడంపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ వైపు ఆందోళన కొనసాగుతుండగా.. ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఆర్డీవో జిల్లా దవాఖానకు చేరుకొని సాయి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.