కుభీర్/తానూర్, నవంబర్1: నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం (పీఏసీఎస్) వద్ద శనివారం సోయా పంట విక్రయాల కోసం టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగింది. ఇక్కడ ఇద్దరి రైతుల కాళ్లు విరగ్గా, పలువురికి గాయాలయ్యాయి. కాగా ఇదే జిల్లా తానూర్ మండల కేంద్రంలోనూ తోపులాట జరగ్గా పలువురు రైతులు స్పృహకోల్పోయారు. వివరాలు ఇలా.. మండల కేంద్రమైన కుభీర్ పీఏసీఎస్ వద్ద సోయా పంట విక్రయాల కోసం టోకెన్లు జారీ చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకొన్న రైతులు శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి వందలాదిగా వచ్చారు. శనివారం ఉదయం 10 గంటల వరకు ప్రాంగణం రైతులతో కిటకిటలాడింది. మహిళా రైతులు కూడా క్యూలో నిల్చున్నారు.
కార్యాలయం గద్దె పైనుంచి ఒక్కసారి వెనక్కి నెట్టడంతో రైతులు కిందపడిపోయారు. ఒకరినొకరు తోసుకోవడంతో ఊపిరాడక సతమతమయ్యారు. దీంతో లక్ష్మి, చంద్రకళతోపాటు మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. లక్ష్మి, చంద్రకళ కాళ్లు విరిగాయి. వీరికి కుభీర్ పీహెచ్సీలో ప్రాథమిక చికిత్స తరువాత భైంసాకు తరలించారు. కుభీర్ ఎస్సై, సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దేందుకు నానా తంటాలు పడ్డారు. భైంసా రూరల్ సీఐ నైలు నాయక్ అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఒక్కో రైతును పిలిచి టోకన్ల జారీ ప్రక్రియను చేపట్టారు. కుభీర్తోపాటు మండలంలోని మాలేగాం, పల్సి, చాత గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలోని గోదాం వద్ద సోయా పంట విక్రయాల టోకెన్ల కోసం రైతులు బారులుదీరారు. వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 1,500 మందికిపైగా రైతులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి క్యూకట్టారు. శనివారం ఉదయం పది గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియను ప్రారంభించగా.. ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో కొందరు రైతులు స్పృహకోల్పోయారు. వీరిని 108 అంబులెన్స్‌లో భైంసా దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, తహసీల్దార్ మహేందర్నాథ్ టోకెన్ల జారీ కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 1081 మందికి టోకెన్లు ఇచ్చారు. మిగతా వారి నుంచి ఆధార్, పట్టాదార్ పాస్‌బుక్ తీసుకొని తర్వాత రావాలని సూచించారు.