Rythu Discom | హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి రైతు డిస్కమ్ ప్రారంభిస్తాం’ ఇది సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన. ఆయన చెప్పిన తేదీ గడిచింది. గడువు పూర్తయ్యింది. కానీ, రైతు డిస్కమ్‌కు రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఇంకా లైసెన్సు జారీచేయకపోవడం, అనుమతి ఇవ్వకపోవడంతో కొత్త డిస్కమ్‌ను ప్రారంభించలేక కాంగ్రెస్ సర్కార్ అభాసుపాలైంది. ఈ విషయంలో కొందరు అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని విద్యుత్తు ఉద్యోగుల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. రైతు డిస్కమ్‌కు ఇప్పుడే లైసెన్సు దక్కుతుందా? లేక మరికొంత సమయం పడుతుందా? అని వారు చర్చించుకుంటున్నారు.
ఈఆర్సీ వర్గాల తర్జనభర్జన
విద్యుత్తు సంస్థల్లో కొత్తగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈఆర్సీ అనుమతి తప్పనిసరి. ముఖ్యంగా కొత్త డిస్కమ్ ఏర్పాటు చేయాలంటే ఈఆర్సీ నుంచి లైసెన్సు తీసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో లైసెన్సు కోసం రైతు డిస్కమ్ సమర్పించిన పిటిషన్‌పై ఈఆర్సీ గత నెల 29న హైదరాబాద్‌లో బహిరంగ విచారణ జరిపింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆ విచారణకు ఎంతో మంది రైతులు, ఉద్యోగ సంఘాల నేతలు, రాజకీయ పార్టీ ప్రతినిధులతోపాటు భారీగా జనం హాజరయ్యారు. రైతు డిస్కమ్ ఏర్పాటుపై 34 అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పాలకపక్షం మినహా అన్ని పార్టీల నేతలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మూడో డిస్కమ్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. రైతు డిస్కమ్‌కు లైసెన్సు ఇవ్వొదని, ఆ డిస్కమ్ సమర్పించిన పిటిషన్‌ను తిప్పిపంపాలని కోరారు. ఇప్పుడున్న రెండు డిస్కమ్‌లను ఆగం చేయరాదని అభ్యర్థించారు. దీంతో ఈఆర్సీ తర్జనభర్జన పడుతున్నది. అందుకే జూన్ 2లోగా లైసెన్సు జారీచేయలేకపోయిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో బహిరంగ విచారణ జరిపే ఆలోచనలో ఈఆర్సీ వర్గాలున్నట్టు ప్రచారం జరుగుతున్నది. దీనిపై ఈఆర్సీ వర్గాలను సంప్రదించినప్పటికీ ఎవరూ స్పందించడం లేదు.
ఈ ప్రశ్నలకు సమాధానాలేవీ?
ఇప్పటికీ తీవ్ర వ్యతిరేకత
రైతు డిస్కమ్ ఏర్పాటుకు ప్రభుత్వం జారీ చేసిన జీవోను విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్లు ఇప్పటికీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానిపై అనేక అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. దీంతో ఈ డిస్కమ్ ఏర్పాటుకు అడ్డంకులు ఎదురవుతాయన్న ఆందోళనతో రేవంత్‌రెడ్డి సర్కార్ ఇప్పటికే కోర్టులో కేవియట్ దాఖలు చేసింది. దీనిపై తీవ్రంగా మండిపడుతున్న విద్యుత్తు ఇంజినీర్లు, ఉద్యోగ సంఘాల నేతలు ఈఆర్సీ ముందు హాజరై కొత్త డిస్కమ్‌కు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు.