మహబూబ్నగర్, మార్చి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/బంజారాహిల్స్ : హైదరాబాద్ జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్రెడ్డి ఇంటి సమీపంలో మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఓ ఆగంతకుడు చొరబడిన ఘటన కలకలం సృష్టించింది. అరుణ నివాసంలోకి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ముసుగు ధరించిన వ్యక్తి ఇంటి వెనకాల నుంచి వచ్చి వంటింటి కిటికీ గ్రిల్ తొలగించి లోనికి వెళ్లాడు. సీసీ కెమెరాల వైర్లను కట్చేసి లోపలికి వెళ్లి గంటన్నరకుపైగా ఇంట్లోనే ఉన్నాడు. ఓ బెడ్రూమ్లో వస్తువులను చిందరవందరగా పడేశాడు. విలువైన వస్తువులు లభించకపోవడంతో వచ్చిన దారినుంచే వెళ్లిపోయాడు. ఉదయాన్నే నిద్రలేచిన డీకే అరుణ చిన్న కుమార్తె ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఎంపీ డీకే అరుణ గద్వాలలో ఉన్నారు. కారు డ్రైవర్ లక్ష్మణ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నా భద్రతపై అనుమానాలు
తన భద్రతపై అనుమానాలు ఉన్నాయని డీకే అరుణ పేర్కొన్నారు. ‘నేను సీఎం రేవంత్రెడ్డి ఉండే ఏరియాలోనే నివాసం ఉంటాను.. అయినా దుండగులు చొరబడుతున్నారు.. ఇంతకు పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఈ ఘటనను ఊహించుకుంటేనే భయమేస్తున్నది. అసలు దొంగ టార్గెట్ ఎవరు? నాకు ఏదైనా ప్రాణహాని తలపెట్టాలని చూస్తున్నారా? నాకు భద్రత పెంచండి అని డీకే అరుణ ప్రభుత్వాన్ని కోరారు.