నిజామాబాద్ / మోర్తాడ్ : రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా, తక్షణమే కన్నెపల్లి పంప్ హౌస్ ( Kannepalli Pumps ) మోటార్లు ఆన్ చేసి, కాళేశ్వరం జలాలను ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపాలని బాల్కొండ శాసనసభ్యులు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి( Vemula Prashanth Reddy ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) పై ఉన్న రాజకీయ కోపంతో, కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగంగా మార్చి తెలంగాణ రైతాంగం కడుపు కొట్టొద్దని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. ఆదివారం మోర్తాడ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు ముఖం చాటేశాయని, రైతులు ఆకాశం వైపు ఎదురుచూసే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు లేక ఇప్పటికీ 30 శాతానికి పైగా పంటలు వేయలేని పరిస్థితి ఉందన్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP)లో కేవలం 15 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందని, ప్రస్తుతం కేవలం 1100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే వస్తోందని వివరించారు. ఎస్సారెస్పీ, కాకతీయ కెనాల్, వరద కాలువ, ప్యాకేజీ 21, గుత్ప అలీసాగర్ లిఫ్ట్ ఇతర ఐడీసీ లిఫ్ట్ లపై ఆధారపడిన నిజామాబాద్, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్,బోధన్ నియోజకవర్గ రైతులు సాగు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఎగువన గోదావరిలో నీరు లేకున్నా, ప్రాణహిత నది ద్వారా ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల నీరు మేడిగడ్డ వద్దకు చేరుకుని ఆంధ్రాకు వెళ్లిపోతోందని వెల్లడించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వృధాగా పోయే జలాలను ఒడిసిపట్టి తెలంగాణ పొలాలను తడపాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేశారని స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కేవలం రెండు పిల్లర్లు మాత్రమే కుంగితే, ప్రాజెక్టు మొత్తం పనికిరాకుండా పోయిందనే భ్రమలు కల్పిస్తూ రెండున్నరేళ్లుగా రేవంత్ రెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టారని మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడును సంతోషపెట్టేందుకు..
డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ కింద ఎల్ అండ్ టీ (L&T) సంస్థ దాదాపు రూ. 400 కోట్ల సొంత ఖర్చుతో ఉచితంగా మరమ్మతులు చేయడానికి ముందుకొచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించకపోవడం కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమన్నారు. కాళేశ్వరం ద్వారా నీళ్లిస్తే ఆ ఘనత కేసీఆర్‌కు దక్కుతుందనే ఏకైక దురుద్దేశ్యంతోనే రేవంత్ రెడ్డి నీటిని లిఫ్ట్ చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ రైతులను ఎండబెడుతూ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును సంతోషపెట్టేందుకు, పోలవరం ప్రాజెక్టుకు నీళ్లు పంపుతున్నారని విమర్శించారు.
లక్ష క్యూసెక్కుల నీరు వృధాగా పోతున్న వాస్తవాన్ని తెలంగాణ సమాజానికి చూపించడానికి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను, ఇతర పార్టీ నాయకులను అడుగడు గునా పోలీసులతో అడ్డుకోవడం ప్రభుత్వ పిరికిపంద చర్య అని దుయ్యబట్టారు. మేడిగడ్డ బ్యారేజీ గేట్లతో సంబంధం లేకుండానే, కేవలం పారుతున్న గోదావరి నీటిని లిఫ్ట్ చేసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. తక్షణమే కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లు స్టార్ట్ చేసి, అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. కేవలం రెండు పిల్లర్ల సాకు చూపి మొత్తం బృహత్తర ప్రాజెక్టును నిరుపయోగంగా మార్చడం దారుణమన్నారు.
రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీకి నీళ్లు
మేడిగడ్డ బ్యారేజీతో ఎలాంటి సంబంధం లేకుండానే నీటిని ఎత్తిపోసే అద్భుతమైన ఇంజనీరింగ్ వ్యవస్థను కేసీఆర్ అప్పుడే సిద్ధం చేసి ఉంచారని ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు. మేడిగడ్డ బ్యారేజీకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేస్తే చాలని, అక్కడ సిద్ధంగా ఉన్న పంపు హౌజ్ బటన్ నొక్కితే కాళేశ్వరం నీరు నేరుగా అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లికి చేరుతుందన్నారు. ఎల్లంపల్లి ద్వారా వరద కాలువ లోకి నీళ్లు పోసి రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీని నింపాలన్నారు. దీంతో కాకతీయ, సరస్వతి కాలువల ద్వారా నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు సాగునీరు అందించవచ్చు అన్నారు.
రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఓట్టు పెట్టి మాట తప్పినందుకే రాష్ట్రంలో వర్షాలు కురవటం లేదు ఆరోపించారు. కాళేశ్వరం లో భాగంగా కేసీఆర్ ఇదివరకే కట్టి ఉంచిన కన్నెపల్లి పంప్ హౌస్ తో పాటు, అన్నారం పంపు హౌజ్, సుందిల్లా పంపు, హౌజ్,ఎల్లంపల్లి పంపు హౌజ్ ,మూడు కాళేశ్వరం రివర్స్ పంపింగ్ మోటార్లు,ప్యాకేజీ 21 మోటార్లను ఆన్ చేసి రైతులకు సాగునీరు అందించాలని వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మోటార్లు ఆన్ చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులందరినీ కలుపుకొని కన్నెపల్లి పంప్ హౌస్, కాళేశ్వరం రివర్స్ పంపింగ్ మోటార్ల బటన్లను తామే స్వయంగా నొక్కి నీటిని విడుదల చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాగంపేట్ శేఖర్ రెడ్డి, కల్లెడ ఏలీయా, నాగధర్ రెడ్డి, బద్దం ప్రవీణ్ రెడ్డి, రాజా పూర్ణనంధం,బద్దం రవి, బద్దం అశోక్, ఆర్మూర్ మహేష్, ఏలేటి రమేష్, బోగా ఆనంద్, పర్శ దేవన్న, పాపాయి పవన్,గోపిడి సత్యనారాయణ, ఏనుగు రాజేశ్వర్,నవీన్, యూసుఫ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.