హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మాదాపూర్‌లోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వార్ రూం కేసు దర్యాప్తును నిలిపేయాలని హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఇందులో పనిచేసే ముగ్గురికి పోలీసులు జారీ చేసిన 41ఏ నోటీసుల అమలును నిలిపివేస్తూ జస్టిస్ కే సురేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుల నోటీసులపై సిమ్లాకు చెందిన ఇషాన్ శర్మ, విశాఖ వాసి తాతినేని శశాంక్, విజయవాడకు చెందిన శ్రీప్రతాప్ సవాల్ చేయగా, పిటిషర్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదించారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్‌రెడ్డి వాదనలు వినిపించారు. మహిళల మనోభావాలు దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఫిర్యాదు రావడంతో కేసు నమోదైందని, విచారణ నిమిత్తం పోలీసులు సీఆర్పీసీలోని సెక్షన్ 41ఏ నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కేసు దర్యాప్తును నిలిపివేస్తూ తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేశారు.
రుణ వివాదానికి సంబంధించి జారీ చేసిన లుక్ఔట్ నోటీసుల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసిన యూకో బ్యాంక్‌కు హైకోర్టు రూ.50 వేలు జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని యూకో బ్యాంక్ రీజినల్ మేనేజర్ సందీప్‌శర్మ నుంచి రికవరీ చేసి హైకోర్టు లీగల్ ఎయిడ్ కమిటీకి చెల్లించాలని ఉత్తర్వులిచ్చింది. ఏపీలోని విజయవాడలో స్థలాన్ని కుదువపెట్టి ముగ్గురితో కలిసి రూ.75 లక్షల రుణం తీసుకొని చెల్లించలేదని యూకో బ్యాంకు లుక్ఔట్ నోటీసులు ఇచ్చింది. దీనిపై ఎంవీ రమణారావు, ఆయన భార్య ఉషారాణి హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై యూకో బ్యాంకు అప్పీల్‌ను కొట్టేసింది.