ఆదిలాబాద్, డిసెంబర్ 21 ( నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో బాలిక కిడ్నాప్‌నకు సంబంధించిన గొడవను అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌కు చెందిన ఏడోతరగతి బాలికను ఓ యువకుడు తీసుకుపోయాడనే విషయం తెలియడంతో ఆమె బంధువులు యువకుడి ఇంటిలోని ఫర్నిచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. పోలీసులు యువకుడి ఇంటికి చేరుకుని బాలిక బంధువులకు నచ్చచెప్పే ప్రయత్నంచేశారు. ఆగ్రహంతో ఉన్న బంధువులు పోలీసులపై రాళ్లతో దాడి చేసి, పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇచ్చోడ సీఐ భీమేశ్, గుడిహత్నూర్ ఎస్సై తిరుపతితోపాటు ఐదుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. యువకుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులు, యువకుడు, బాలికను రిమ్స్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.