ఆర్మూర్‌టౌన్, ఏప్రిల్ 7: బీఆర్ఎస్ రజతోత్సవం.. పాతికేండ్ల సమరోత్సాహమని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న వరంగల్ గడ్డపై నిర్వహించనున్న ఓరుగల్లు జన జాతర కాంగ్రెస్ పార్టీ దుష్ట పాలనకు పాతర అని చెప్పారు. రజతోత్సవ సభ విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై సోమవారం ఆర్మూర్‌లో ముఖ్య నేతలతో జీవన్‌రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మగౌరవ పతాక, పేదల గొంతుక అని అన్నారు. రేవంత్ దుష్ట పాలనపై తెలంగాణ రగులుతున్నదని, ఇక్కడి బీజేపీ నేతలకు తెలంగాణ మట్టి వాసనే గిట్టదని, వారు గుజరాత్ గులాంలుగా మారారని జీవన్‌రెడ్డి విమర్శించారు. వరంగల్ సభకు గులాబీ సైన్యం కదం తొక్కొలని పిలుపునిచ్చారు.
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి ; బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ) : వరంగల్‌లో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవసభను విజయవంతంచేయాలని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశానికి నిరంజన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ పదేండ్లపాలన ప్రజాసంక్షేమమే పరమావధిగా సాగిందన్నారు. 25 ఏండ్ల బీఆర్ఎస్ ప్రస్థానాన్ని రజతోత్సవ సభ ద్వారా భావితరాలకు స్ఫూర్తి కలిగించేలా జరుగనుందని చెప్పారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, కేసీఆర్ ప్రాధాన్యత, బీఆర్ఎస్ అవసరం ప్రజలకు తక్కువ సమయంలోనే తెలిసి వచ్చిందని వివరించారు.