హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): పసుపును నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వాలని రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి కోరారు. మంగళవారం హాకాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పసుపు రైతుల కోసం వైఎస్ హయాంలోనే నిజామాబాద్ జిల్లాలో పసుపు పరిశోధన సంస్థ కోసం స్థలం కేటాయించారని, మద్దతు ధర లేకున్నా అప్పటి కేంద్ర ప్రభుత్వ అనుమతితో పసుపు కొనుగోలు చేసినట్టు తెలిపారు.
ఆ సమయంలో అత్యధికంగా క్వింటాల్‌కు 16వేల ధర పలికిందని గుర్తుచేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేసి ఒక ఐఏఎస్ అధికారిని నియమించినా.. మద్దతు ధర కల్పించలేకపోతుందని విమర్శించారు. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి రైతులకు మద్దతు ధర దక్కకుండా చేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించానని తెలిపారు. ఇప్పటికే పసుపును నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని కేంద్రానికి లేఖ రాసినట్టు వివరించారు.