హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల మరమ్మతు పనులను జనవరి 10 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జనవరి ఐదోతేదీలోగా టెండర్ల ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రూ. 2,500 కోట్లు మంజూరు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రోడ్ల మరమ్మతులపై బుధవారం మంత్రి వేముల ఎర్రమంజిల్‌లోని ఆర్అండ్బీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రెండు సీజన్లలో వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులను యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ నిర్దేశిత గడువులోగా మరమ్మతు పనులు పూర్తిచేయాలన్నారు. ఇప్పటికే 70 శాతం టెండర్ల ప్రక్రియ పూర్తయిందని అధికారులు తెలుపగా, మిగిలిన టెండర్లను కూడా వచ్చే జనవరి ఐదులోగా పూర్తిచేసి, పదో తేదీ నుంచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్అండ్బీ కార్యదర్శి శ్రీనివాస్‌రాజు, ఈఎన్సీ రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.