మల్లాపూర్, జూన్ 24: బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను కాంగ్రెస్ చేర్చుకోవడంపై కలత చెందిన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన కాంగ్రెస్ కిసాన్ సెల్ విభాగం రాష్ట్ర కో-ఆర్డినేటర్ వాకిటి సత్యంరెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఫ్యాక్స్ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు తన రాజీనామా లేఖ పంపించారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా నామినేషన్ వేసి గెలుపొంది ప్రజల గొంతుకగా నిలిచిన ఏకైక వ్యక్తి జీవన్రెడ్డేనని, అలాంటి నాయకుడిని అవమానించడం సరికాదని మండిపడ్డారు. రాష్ట్రస్థాయి కీలక నేతకు ఇచ్చే గౌరవం ఇది కాదని, ఇప్పటికైనా అధిష్ఠ్టానం పునరాలోచించాలని సూచించారు.
తనవంతు బాధ్యతగా రాష్ట్ర కో-ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసి, సాధారణ కార్యకర్తగానే పనిచేస్తానని సత్యంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.