హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఎైక్సెజ్ శాఖ ఆదాయం ఏడాదిలో రూ.2 వేల కోట్లకుపైగా పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.40,209 కోట్లకు చేరింది. 2018-19లో రూ.20,859 కోట్లుగా ఉన్న ఈ ఆదాయం.. 2024-25లో రూ.37,487 కోట్లకు చేరింది. దీనితో పోలిస్తే 2025-26లో రాబడి రూ.2,722 కోట్లు, మద్యం అమ్మకాలు 7% పెరిగాయి. రాష్ర్టాన్ని నడిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా మద్యం ఆదాయంపైనే దృష్టిసారించింది. అందులో భాగంగా మద్యం అమ్మకాలను, వాటి ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచడంతోపాటు ఊరూరా బెల్ట్‌షాపులను ప్రోత్సహిస్తున్నది. మద్యం దుకాణాల లైసెన్సు ఫీజులను సైతం భారీగా పెంచింది.
అలా 2024-25లో 372.25 లక్షల కేసుల లిక్కర్, 536.13 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరగ్గా.. 2025-26లో 382.91 లక్షల కేసుల లిక్కర్, 387.34 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. దీనితోపాటు ఎైక్సెజ్ శాఖకు 2,620 ఏ-4 మద్యం దుకాణాల ద్వారా రూ.1,771 కోట్ల రెంటల్ ఫీజు, 1,214 బార్ల ద్వారా రూ.549 కోట్లు, 95,628 దరఖాస్తుల ద్వారా రూ.2,869 కోట్ల ఆదాయం వచ్చింది. అందుకే ఎక్సైజ్ రాబడి భారీగా పెరిగిందని మద్యం వ్యాపారులు చెప్తున్నారు. మద్యాన్ని నియంత్రిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
