హైదరాబాద్, జూన్ 29( నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నికలో మాజీ ఎంపీ అజహరుద్దీన్ అభ్యర్థిత్వానికి చెక్ పెట్టేందుకు ముఖ్యనేత వర్గం సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అసలు కాంగ్రెస్ వర్గం నేతగా గుర్తింపు ఉన్న అజహరుద్దీన్‌ను గెలిపించి, మంత్రి పదవిలోకి తీసుకుంటే కీలకమైన హైదరాబాద్ నగరాన్ని వదులుకున్నట్టేనని సైకిల్ కాంగ్రెస్ వర్గం భయపడుతున్నట్టు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలో గెలుపొందిన వ్యక్తికి మంత్రి పదవి దక్కే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యనేత ఇప్పటి నుంచే ఉప ఎన్నిక బరిలోకి దింపే అభ్యర్థిపై దృష్టి సారించినట్టు సమాచారం. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తికి టికెట్ ఇచ్చి గెలిపించుకుని, మంత్రి పదవి ఇప్పించుకుంటే హైదరాబాద్‌పై ఆధిపత్యం కొనసాగించవచ్చని భావిస్తున్నట్టు తెలిసింది. అజహర్‌ను గెలిపించి, మంత్రి వర్గంలోకి తీసుకుంటే అసలు కాంగ్రెస్ నేతలకు మరింత బలాన్ని ఇచ్చినట్టు అవుతుందని, పైగా కీలకమైన హైదరాబాద్ అసలు కాంగ్రెస్ వర్గం నేతల చేతుల్లోకి వెళ్లిపోతుందని భయపడుతున్నట్టు సమాచారం.
ఎంఐఎంను బూచిగా చూపించి
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3.75 లక్షల ఓట్లు ఉండగా, అందులో 1.25 లక్షలపైగా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉండటంతో అధిష్ఠానం అజహర్ వైపే మొగ్గుచూపినట్టు తెలిసింది. దీంతో సైకిల్ బ్యాచ్ నేతలు ఎంఐఎం నేతను రంగంలోకి దించినట్టు ప్రచారం జరుగుతున్నది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మైనారిటీ అభ్యర్థిని కాంగ్రెస్ బరిలోకి దింపితే తాము పోటీలో ఉంటామని ఇటీవల ఎంఐఎం హెచ్చరించింది. ఇదే విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లిన సైకిల్ కాంగ్రెస్ నేతలు.. అదే జరిగితే ఓట్ల చీలికకు దారి తీస్తుందని, తర్వారా ఓటమి తప్పదని ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం.
బరిలోకి ఆ ముగ్గురు
సైకిల్ బ్యాచ్ ముఖ్యనేత ముగ్గురు వ్యక్తులను బరిలోకి దింపుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వారిలో ముఖ్యనేతకు అత్యంత నమ్మకస్తుడు, అందాల పోటీలో అసభ్య ప్రవర్తన అరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా ఉన్నట్టు తెలిసింది. ఆయనకు టికెట్ ఇప్పించాలని ముఖ్యనేత పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. ఆయన కూడా అజహరుద్దీన్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే, కాబట్టి ఎంఐఎం హెచ్చరికలు ఆయనకు కూడా వర్తిస్తాయనే ఆందోళనతో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఆయన కాకపోతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ, వ్యాపారవేత్తకు టికెట్ ఇప్పించే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. సదరు నేత అయితేనే ఉప ఎన్నికలకు అయ్యే ఖర్చును సులువుగా భరించగలడని, అటు ఎమ్మెల్యే టికెట్‌కు, మంత్రి పదవికి యోగ్యుడు అని సైకిల్ బ్యాచ్ అంచనా వేస్తున్నట్టు తెలిసింది. ఏదైనా అనివార్య కారణాలతో అతనికి టికెట్ రాకుంటే ముఖ్యనేత అనుచరుడిగా, విద్యాశాఖలో షాడో మంత్రిగా ఉన్న వ్యక్తికి టికెట్ ఇప్పించే ఆలోచనతో ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.
అజర్ వేగానికి సైకిల్ అడ్డుకట్ట
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీకి దాదాపు 10 మంది పోటీపడుతున్నారు. వీరిలో మాజీ ఎంపీ అజారుద్దీన్, మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్, విజయారెడ్డి, నవీన్‌యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మైనార్టీ నేత ఫహీం ఖురేషీ, హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అజార్ ఇప్పటికే తనకు తానుగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్నారు. ఇటీవల మీడియా ఎదుట కూడా ఈ విషయాన్ని చెప్తూ కుండబద్దలు గొట్టారు. దీంతో ఈ విషయాన్ని సైకిల్ కాంగ్రెస్ వర్గం నేరుగా మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె అజార్‌ను మందలించినట్టు సమాచారం.