మోర్తాడ్, జూలై 22: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎస్సారెస్పీ ఆయకట్టు రైతుల పంటలు కాపాడేందుకు వెంటనే ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మంగళవారం ఎస్సారెస్పీ ఎస్ఈ శ్రీనివాస్‌రావు గుప్తాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఒక తడికి నీళ్లు ఇచ్చి వర్షాలు పడితే ఆపేయాలని సూచించారు. లక్ష్మి కాలువ ద్వారా నీటిని వదలాలని, కాకతీయ కాలువకు కొంత నీటిని వదిలితే ఉప్లూర్ వద్ద గేట్లు వేసి ఆ నీటిని పంట పొలాలకు మళ్లించుకుంటారని చెప్పారు. అదే పద్ధతిన వరద కాలువకు కొంత నీటిని వదిలితే గేట్లు వేసి పొలాలకు మళ్లించుకుంటారని వివరించారు. పవర్‌హౌజ్ నుంచి వెళ్లే వృథానీటిని గోదావరి నదిలోకి దిగువన వదిలితే పశువులకు తాగునీటికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి వివరించాలని సూచించారు.