SLBHS | దోమలపెంట, మే 22 : తెలంగాణ-ఏపీ సరిహద్దులోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్తు కేంద్రం (SLBHS) యూనిట్-4 పనులు నత్తనడకన సాగుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలోని జలవిద్యుత్తు కేంద్రంలో 6 యూనిట్లు ఉన్నాయి. ఇందులో ఒక్కో యూనిట్లో 150 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. 2020 ఆగస్టు 20న యూనిట్లో బ్యాటరీలు మారుస్తుండగా.. షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. నైట్ డ్యూటీలో ఉన్న ఐదుగురు ఇంజినీర్లు, ఇద్దరు ప్లంట్ అసిస్టెంట్లు, హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు అమరరాజా బ్యాటరీ కంపెనీ ఉద్యోగులు కేంద్రాన్ని రక్షించాలని చివరి వరకు ప్రయత్నించి ప్రాణాలు వదిలారు. ఈ ఘటనలో 4వ యూనిట్ పూర్తిగా దగ్ధమవగా.. మిగతా యూనిట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో రూ.100 కోట్ల నష్టం సంభవించింది. ప్రమాదం తర్వాత మరమ్మతులు చేయడం కోసం ఒక ప్రముఖ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వగా.. యూనిట్ సిద్ధం చేసిన కొద్దిరోజులకే మళ్లీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. దీంతో మళ్లీ మరమ్మతులు చేపట్టగా.. పనుల్లో జాప్యం జరుగుతున్నది.
అగ్ని ప్రమాదంలో దగ్ధమైన నాలుగో యూనిట్ మరమ్మతులు చేపట్టేందుకు ఢిల్లీకి చెందిన వాయిత్ కంపెనీ రూ.14,93,41,271కు టెండర్ దక్కించుకున్నది. 2021 సెప్టెంబర్‌లో పనులు ప్రారంభించి, 2023 జూలై చివరి నాటికి పనులు పూర్తి చేసి జెన్కోకు అప్పగించింది. 2023 జూలై 17న ఈ యూనిట్‌ను రన్ చేసి, గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. 19 రోజుల్లో 72 గంటల వ్యవధిలో 11.6929 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేశారు. 2023 ఆగస్టు 17న స్టేటర్ వైండింగ్ బార్స్‌లో షార్ట్‌సర్క్యూట్ కావడంతో మరోసారి మంటలు చెలరేగాయి. సదరు కాంట్రాక్ట్ సంస్థ, జెన్కో సక్రమంగా రన్ చేయకపోవడంతోనే షార్ట్‌సర్క్యూట్ అయ్యిందని తప్పించుకునే ప్రయత్నం చేసింది. జెన్కో యాజమన్యం నిపుణుల కమిటీతో విచారణ చేయించగా.. మరమ్మతులలో నాసిరకం మెటీరియల్ వాడటంవల్లే ఈ ప్రమాదం జరిగిందని నివేదిక ఇచ్చింది. దీంతో వాయిత్ కంపెనీ కాంట్రాక్ట్ లైసెన్స్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్టు జెన్కో మాజమాన్యం ప్రకటించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నాలుగో యూనిట్ మరమ్మతులను పూర్తి చేసి ఈ ఏడాది వానకాలం సీజన్ నాటికి యూనిట్‌ను సిద్ధం చేయాలని ఆదేశించింది. బ్లాక్ లిస్ట్‌లో చేర్చిన వాయిత్ కంపెనీకే తిరిగి పనులు అప్పగించింది.
ఏడాదిన్నర కిందట కాలిపోయిన 4వ యూనిట్‌కు మరమ్మతులు పూర్తిచేసి, అప్పగించాలని వాయిత్ కంపెనీతో అగ్రిమెంట్ ఉన్నది. ఈ విషయమై జెన్కో యాజమాన్యం కంపెనీపై ఒత్తిడి తీసుకురాగా.. తమకు అదనంగా నిధులు కేటాయిస్తే తప్ప పనులు చేయమని తెగేసి చెప్పడంతో చేసేది లేక మరో రూ.1.30 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్టు సమాచారం. దీంతో 20 రోజుల కిందట 4వ యూనిట్లో మరమ్మతు పనులు ప్రారంభంకాగా నత్తనడకన సాగుతున్నాయి.
ఏడాది కిందట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు కలిసి భూగర్భ జల విద్యుత్తు కేంద్రాన్ని సందర్శించారు. 4వ యూనిట్‌ను పరిశీలించి జెన్కో యాజమాన్యంతో సమీక్ష నిర్వహించారు. గతేడాది జరగాల్సిన పనులు, జెన్కో యాజమాన్యం, వాయిత్ కంపెనీకి మధ్య కొన్ని ఇబ్బందులు రావడంతో పనులు ఆలస్యం అయ్యాయి. తర్వాత ఇద్దరి మధ్య సయోధ్య కుదరడంతో మళ్లీ పనులు ప్రారంభమయ్యాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆదేశించినా పనులు మాత్రం ముందుకు సాగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
2020 లో జరిగిన అగ్ని ప్రమాదంతో 4వ యూనిట్ పూర్తిగా కాలిపోగా.. నాలుగేండ్లుగా విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. ఒక్క యూనిట్లో 24 గంటల ఉత్పత్తి కొనసాగితే రోజుకు 36 లక్షల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. నాలుగేళ్లుగా 172.80 కోట్ల యూనిట్ల ఉత్పత్తి నిలిచిపోయినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం ప్రైవేటు రంగ విద్యుత్ సంస్థలతో విద్యుత్ కొనుగోలు చేసేందుకు యూనిట్‌కు రూ.5 వరకు చెల్లిస్తున్నది. ఈ విధంగా లెక్కిస్తే రూ.864 కోట్ల నష్టం వాటిల్లినట్టు చెప్పొచ్చు. 4వ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి జరిగి ఉంటే ప్రభుత్వపరంగా పేదలకు ఉచితంగా ఇస్తున్న పథకానికి ఇబ్బంది ఉండేది కాదని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. 4వ యూనిట్‌కు సంబంధించిన ఇంజినీర్‌ను వివరణ కోరగా.. మరమ్మతులు ఆలస్యమవడం వాస్తవమే అన్నారు. గత నెల 30న పనులు ప్రారంభించామని, మరో మూడు నెలల్లో యూనిట్‌ను సిద్ధం చేస్తామని తెలిపారు.