హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): అండర్ వాటర్ డ్రోన్లతో శ్రీశైలం డ్యామ్ దిగువన ఏర్పడిన ప్లంజ్‌పూల్ పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నారు. సంబంధించిన ఫొటోలను సేకరిస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ నుంచి వచ్చే భారీ ప్రవాహానికి స్పిల్‌వే దిగువన 40 మీటర్ల లోతులో ప్లంజ్‌పూల్ (భారీ గొయ్యి) ఏర్పడిందని, ఆ నకట్టకు ప్రమాదం పొంచి ఉన్నదని గతంలోనే ఏబీ పాండ్యా కమిటీ హెచ్చరించింది. సత్వరం డ్యామ్ భద్రత పనులను చేపట్టాలని, స్కై జంప్ బకెట్‌కు మరమ్మతులు చేయాలని సూచించింది.
ఇటీవల డ్యామ్‌ను సందర్శించిన ఎన్డీఎస్ఏ చైర్మన్ అతుల్‌జైన్ కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం నిర్వహిస్తున్న తీరుపై ఎన్డీఎస్ఏ ఆందోళన వ్యక్తం చేసింది. స్పిల్‌వే దిగువన ప్లంజ్‌పూల్ మరింత లోతుకు, ఆనకట్ట పునాది వైపునకు విస్తరిస్తున్నదని, ఫలితంగా పునాది నిర్దేశిత గ్రేడ్ కంటే చాలా తకువకు పడిపోతున్నదని, వెర సి ఆనకట్ట స్థిరత్వం ప్రమాదకరంగా మారిందని హెచ్చరించింది. తక్షణం రక్షణ చర్యలు చేపట్టాలని మార్గదర్శకా లు జారీ చేసింది. దీంతో ఏపీ సర్కారు ఎట్టకేలకు స్పందించింది. మరమ్మతు పనులపై కసరత్తు చేస్తున్నది.