Srisailam | హైదరాబాద్, జనవరి22 (నమస్తే తెలంగాణ): ‘ఇటేపు రమ్మంటే ఇల్లంత నాదే’ అన్న చందంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు. ఇప్పటికే చెన్నైకి తాగునీటి పేరిట జలవిద్యుత్తు ప్రాజెక్టు శ్రీశైలం డ్యామ్‌కు కన్నం పెట్టింది. ఇష్టారాజ్యంగా కృష్ణా జలాలను పెన్నా బేసిన్‌కు మళ్లిస్తున్నది. అక్కడితో ఆగకుండా తాజాగా ఆ జలవిద్యుత్తు ప్రాజెక్టు నుంచే విద్యుత్తు ఉత్పత్తి చేపట్టకుండా మోకాలడ్డుతున్నది. ఎండీడీఎల్నే మార్చాలని పట్టుబడుతున్నది. ఆ దిశగా గుట్టుగా పావులు కదుపుతున్నది. వెరసి శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ చేజారిపోయే ప్రమాదం పొంచి ఉన్నదని రాష్ట్ర ఇంజినీరింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
జలవిద్యుత్తు ప్రాజెక్టుగాశ్రీశైలం డ్యామ్ మార్పు
1953లో మద్రాస్ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టును ఇరిగేషన్ ప్రాజెక్టుగా ప్రతిపాదించినప్పటికీ, ఆ తరువాత జలవిద్యుత్తు ప్రాజెక్టుగా మార్చారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వమే ఆ మేరకు 1959లో ప్లానింగ్ కమిషన్‌కు, విద్యుత్తు సంస్థకు నివేదించగా, అటు తరువాత అనేక షరతులతో 1963లో ఆమోదం లభించింది. 1969లో ఏర్పాటైన బచావత్ ట్రిబ్యునల్‌కు సైతం శ్రీశైలం కేవలం జలవిద్యుత్తు ప్రాజెక్టేనంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రిపోర్టు ఇచ్చింది. దీంతో శ్రీశైలం డ్యామ్‌ను కేవలం విద్యుత్తు ఉత్పాదక ప్రాజెక్టుగానే బచావత్ ట్రిబ్యునల్ పరిగణించింది. ప్రాజెక్టులోని నీటిని విద్యుత్తు ఉత్పత్తి కోసమే తప్ప ఇతర అవసరాలకు విడుదల చేయవద్దని తెలిపింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టును సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కలుపుకుని 405 టీఎంసీల భారీ సామర్థ్యంతో చేపట్టారు. అందులో భాగంగా సాగర్ ప్రాజెక్టు అవసరాలను తీర్చేందుకు సరిపడే నీటిని నిల్వ చేసుకునేందుకు వీలుగా శ్రీశైలం రిజర్వాయర్‌ను నిర్మించారని, శ్రీశైలం నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ, 280 టీఎంసీలను సాగర్‌కు విడుదల చేయాల్సి ఉన్నదని తెలంగాణ స్పష్టం చేసింది. కానీ ప్రస్తుతం జలవిద్యుత్తు ప్రాజెక్టు నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేయడంపైనే ఆంక్షలు పెట్టే దుస్థితి నెలకొన్నది.
ఎండీడీఎల్ మార్పు వెనక మర్మమిదే
శ్రీశైలం డ్యామ్ నుంచి జలవిద్యుత్తు ఉత్పత్తికి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేవు. ప్రాజెక్టు వాస్తవ ఎండీడీఎల్ 834 అడుగులు. ఆ మేరకు జలవిద్యుత్తును ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉన్నది. ఒకదశలో శ్రీశైలం ప్రాజెక్టులో 760 అడుగుల వరకూ నీటిని విడుదల చేయవచ్చని 2013లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ, ప్రస్తుతం ఆ ఎండీడీఎల్‌ను ఏకంగా 854 అడుగులకు నిర్ణయించేందుకు ఏపీ పట్టుబడుతున్నది. చెన్నై నగరానికి తాగునీటిని సరఫరా చేసేందుకు వీలుగా శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 ఎండీడీఎల్ మెయింటెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నది. ఆవిరి నష్టాల కింద శ్రీశైలం ప్రాజెక్టుకు 33 టీఎంసీల నీటిని కేటాయించాలంటూ ఏపీ చేసిన విజ్ఞప్తి ట్రిబ్యునల్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఏపీ మరో ఎత్తు వేసింది. చెన్నై తాగునీటి అంశాన్ని ఆసరాగా చేసుకుని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ఏర్పాటుకు పూనుకున్నది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు 874 ఎత్తు వద్ద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది.
ఆ తరువాత చెన్నై తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్ఆర్బీసీ)కి 19 టీఎంసీలు మొత్తంగా 34 టీఎంసీలను తరలించేందుకు 854 అడుగుల వద్ద పోతిరెడ్డిపాడు నుంచి జలాలను తరలించేలా ఏర్పాటుచేసింది. అక్కడితో ఆగకుండా హెడ్‌రెగ్యులేటరీని విస్తరించుకుంటూ ఏటా బేసిన్ అవతలికి కృష్ణా జలాలను అక్రమంగా మళ్లిస్తున్నది. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను ఎక్కువ మొత్తంలో తరలించాలంటే ప్రాజెక్టు ఎండీడీఎల్ 854 అడుగులు ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ఎండీడీఎల్ మార్పునకు ఏపీ పట్టుబడుతున్నది. ఆ మేరకు కేంద్రానికి, కేఆర్ఎంబీకి అనేకసార్లు లేఖలు రాసింది. కేంద్రం సైతం గతంలో శ్రీశైలం ఎండీడీఎల్‌ను 854గా నిర్ధారిస్తూ ప్రాజెక్టు రూల్‌కర్వ్స్‌ను రూపొందించింది. రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీలో ఈ అంశంపై చర్చకు పెట్టింది. కానీ, అది ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎత్తుగడలను గమనించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో-34 విడుదల చేసింది. 834 అడుగుల వరకు పూర్తి సామర్థ్యం మేరకు విద్యుత్తు ఉత్పత్తి చేయాలని అందులో పేర్కొన్నది. ఆ జీవోను కొట్టేయాలని కోరుతూ ఏపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు ప్రస్తుతం ఎండీడీఎల్ మార్పునకు గుట్టుగా పావులు కదుపుతున్నదని ఇంజినీరింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణకు తీరని నష్టం
ఇప్పటికే పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణాజలాలను ఇష్టారాజ్యంగా తరలించడం వల్ల తెలంగాణకు నష్టం వాటిల్లుతున్నది. ప్రస్తుతం ఎండీడీఎల్‌ను మార్చినా అంతే నష్టం తప్పదని ఇంజినీర్లు, నీటిరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో ఎత్తిపోతల ద్వారానే తెలంగాణ ప్రాంతానికి నీటిని అందించాల్సి ఉంటుంది. అందుకు విద్యుత్తు అత్యవసరం. జలవిద్యుత్తు అత్యంత చౌకగా లభిస్తుంది. శ్రీశైలంలో నీరు నిల్వ ఉంటే నిరంతరాయం విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే అవకాశముంటుంది. కానీ, ఎండీడీఎల్‌ను 854 అడుగులకే నిర్ణయిస్తే ఆ మేరకు జలాలు ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్తును ఉత్పత్తి చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. అది తెలంగాణ సాగునీటి, తాగునీటి అవసరాల విద్యుత్తు డిమాండ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.