హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ (కమర్షియల్ ట్యాక్స్) కార్యాలయంలో ఆ శాఖ కమిషనర్గా టీకే శ్రీదేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీదేవికి కొద్దిరోజులు కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్గా పనిచేసిన అనుభవం ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అప్పుడు ఎన్నికల సంఘం చేపట్టిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా శ్రీదేవిని కూడా బదిలీ చేశారు. రెండు నెలల్లోనే శ్రీదేవిని మళ్లీ అదే శాఖ కమిషనర్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు స్వీకరించిన శ్రీదేవికి తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీసీటీజీవోఏ) అధ్యక్షుడు వీ శ్రీనివాసరెడ్డితోపాటు కార్యాలయ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.