గురువారం 16 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 20:01:36

హైదరాబాద్‌ శిథిల భవనాల కూల్చివేతకు ప్రత్యేక డ్రైవ్‌

 హైదరాబాద్‌ శిథిల భవనాల కూల్చివేతకు ప్రత్యేక డ్రైవ్‌

హైదరాబాద్‌: వానకాలంలో జరిగే ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో శిథిలావస్థకు చేరిన భవనాలను ముందస్తుగా కూల్చివేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. ఇలాంటి భవనాల గుర్తింపునకు సర్కిళ్లవారీగా సర్వే చేపట్టినట్లు పేర్కొన్నారు. గతంలో గుర్తించిన శిథిల భవనాలతోపాటు ప్రస్తుతం గుర్తించే భవనాలను ప్రత్యేక డ్రైవ్‌లో కూల్చివేస్తామన్నారు. ప్రమాదకరంగా ఉన్న శిథిల భవనాలను వెంటనే ఖాళీ చేయించి వాటిని సీజ్‌ చేయనున్నట్లు చెప్పారు. ప్రజలు వాటివైపు వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటుచేయడంతోపాటు హెచ్ఛరిక బోర్డులను కూడా పెడతామని వెల్లడించారు. గడిచిన నాలుగేండ్లలో 1438 శిథిల భవనాలను కూల్చివేసినట్లు వివరించారు.

గతంలో వానకాలంలో జరిగిన సెల్లార్‌ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని సెల్లార్‌ తవ్వకాలను నిషేధించినట్లు కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ చెప్పారు. ఇప్పటికే తవ్విన సెల్లార్ల వద్ద తగిన జాగ్రత్త చర్యలు పాటించాలని అధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ వంటి కొండ ప్రాంతాల్లో ప్రహరీగోడలు కూలి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున గోడల వెంబడి గుడిసెల్లో నివసించే వారిని ఖాళీ చేయించాలని సూచించారు.


logo