హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): అక్షయ తృతీయ, ధన త్రయోదశి రోజుల్లో.. పండుగలు, పెండ్లిలు, వ్రతాలు ఇతర శుభకార్యాలకు బంగారాన్ని కొనడం, ధరించడం ఆనవాయితీగా వస్తున్నది. దీంతో ప్రాంతీయ, దేశీయ రిటైల్ దుకాణాల హవా జోరుగా సాగుతున్నది. చాలా బంగారు దుకాణాలు హైదరాబాద్లో అధిక సంఖ్యలో తమ బ్రాంచీలను ఏర్పాటు చేశాయి. వీటివల్ల చిన్న వ్యాపారుల బిజినెస్ కొంత తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. కొనుగోలుదారులు సైతం పెద్ద షాపులపై ఆసక్తి కనబరుస్తున్నారు. బంగారు విక్రయాల్లో చిన్నషాపుల వాటా 50 నుంచి 35 శాతానికి పడిపోయిందని విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామాలతో వ్యాపారుల్లో పోటీతత్వం పెరిగింది. నాణ్యతతో కూడిన పసిడి విక్రయాలు పెరిగాయి. ప్రజలు ఇటీవల యంత్రాల మీద రూపొందించిన ఆభరణాలపై ఆసక్తి చూపిస్తున్నారు.
పోటీ వాతావరణంతో బంగారు దుకాణాలు పలు రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. బంగారం కొనుగోలు చేసే ముందు దాని ధర తెలుసుకోవాలంటూ, ఇతర షాపుల్లో బంగారం నాణ్యత తమ షాపుల్లో బంగారు నాణ్యత పరిశీలించుకోవాలని ఏకంగా ప్రకటనలు ఇస్తున్నాయి. అంతలా పోటీ నెలకొంది. పసిడి ధర ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అన్నిచోట్లా ఒకేలా ఉండదు. పండుగల వేళ దుకాణాల మంజూరీపై తగ్గింపు, లక్కీ డ్రాలు, రాయితీలు, జీరో మేకింగ్ చార్జీలు వంటి ఆఫర్లెన్నో ప్రకటిస్తుంటాయి. వీటిన్నింటిపై కస్టమర్లు అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం కొనుగోలులో మరో ముఖ్యమైన అంశం ఏంటటే స్వచ్ఛత 24 క్యారెట్ల పుత్తడిని స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారని నిపుణులు చెబుతున్నారు. అది మృదువుగా ఉండటంతో ఆభరణాల తయారీకి వెండి, రాగి వంటి ఇతర లోహాలను కలుపుతారు. వాటి స్వచ్ఛతను తెలియజేసే ముద్ర ఆభరణంపై క్యారెంట్ (22కే916) ఉందో లేదో పరిశీలించుకోవాలని చెబుతున్నారు. కొందరు పాత బంగారం ఇచ్చి కొత్త ఆభరణాలు కొంటుంటారు. వర్తకులు ఆ పాత బంగారాన్ని కరిగించి మళ్లీ విక్రయంలోకి తెస్తారని నిపుణులు చెబుతున్నారు.