రైలు కార్యకలాపాలలో భద్రత నిర్ధారణకు అనుసరిస్తున్న భద్రతా విధానాలపై దృష్టి సారించాలని అధికారులు, సిబ్బందికి దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సూచించారు. సోమవారం ఎస్సీఆర్ పరిధిలో అన్ని జోన్ల విభాగాధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాన్ని సమీక్షించారు. సేఫ్టీ డ్రైవ్ పద్దతిలో ఏవైనా లోపాలు ఉన్నాయా అన్న విషయమై ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ డివిజన్ల రైల్వే మేనేజర్లు పాల్గొన్నారు.
లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, గార్డులు, ట్రాక్ మెషిన్ ఆపరేటర్లు, టవర్ వ్యాగన్ ఆపరేటర్లు తదితర భద్రతా సంబంధిత సిబ్బందికి కౌన్సెలింగ్ క్రమం తప్పకుండా నిర్వహించాలని అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. సేఫ్టీ డ్రైవ్తోపాటు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం భద్రతను నిర్ధారించడానికి భద్రతా విధానాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
సిబ్బంది పని గంటలపైనా చర్చించారు. సిబ్బందికి సరైన విశ్రాంతి ఇవ్వడానికి జాగ్రత్తగా ప్రణాళిక వేయాలని అన్నిడివిజనల్ రైల్వే మేనేజర్లను ఆదేశించారు డివిజన్లో చేపడుతున్న ట్రాఫిక్ సౌకర్యం, ట్రాక్ పునరుద్ధరణ, డబ్లింగ్ తదితర పనుల పురోగతిని సమీక్షించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి, పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు.