హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): భూసంబంధిత వివరాల సేకరణకు, ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయడానికి గ్రామస్థాయిలో రెవెన్యూ అధికారిని నియమించాలని పలువురు వక్తలు కోరారు. గ్రామాలవారీగా రికార్డులు తయారు చేసి, డిజిటలైజ్తోపాటు మ్యానువల్ కూడా రూపొందించాలని సూచించారు. పహాణీ, కాస్తుకాలం కొనసాగించాలని కోరారు.
తెలంగాణ హకుల రికార్డు బిల్లు-2024పై తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని వైవీ కృష్ణారావు రైతుభవన్లో శనివారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు.
సంఘం ప్రధాన కార్యదర్శి పద్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వ్యవసాయ రంగ నిపుణులు నరసింహారెడ్డి, హైకోర్టు న్యాయవాదులు వేణుగోపాల్, రాజ్‌రెడ్డి, గోకుల్, రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు, సామాజిక కార్యకర్త సాధిక్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభులింగం, కార్యదర్శి రాజిరెడ్డి పాల్గొన్నారు.