హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ సీఎం కేసీఆర్ చావును కోరుకుంటున్నామని అనలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు. కేవలం చావు డప్పు కొడుతామని మాత్రమే అన్నారని వెనుకేసుకొచ్చారు. ఒకవైపు, కేసీఆర్ చావాలని కోరుకుంటున్నట్టుగా వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా, స్పీకర్ మాత్రం ఆయనను వెనుకేసుకొనిరావడం గమనార్హం. స్పీకర్ గడ్డం ప్రసాద్ మంగళవారం అసెంబ్లీలోని తన చాంబర్లో తొలిసారిగా మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా స్పీకర్ పలు అంశాలను మీడియాతో పంచుకున్నారు. తాను అనుకుంటే ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సభ్యత్వాలను రద్దు చేయగలనని, కానీ అలా చేయడం పద్ధతి కాదని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తనను తిట్టిన వీడియోను చూశానని తెలిపారు. అయితే వాళ్లు క్షమాపణ చెబుతారని అనుకున్నానని చెప్పారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సునీతాలక్ష్మారెడ్డి, సబితాఇంద్రారెడ్డిపై పోలీసులు దాడి చేయడంపై ఎలా స్పందిస్తారని మీడియా ప్రశ్నించగా.. దీనిపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల దాడి గురించి ప్రశ్నించగా.. ఎమ్మెల్యేలే పోలీసులను కొట్టినట్టుగా కనిపించిందన్నారు.