వేలేరు, జూన్ 16: హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లికి చెందిన దొనికెల శంకరయ్య తన భార్య విజయకు క్యాన్సర్ వచ్చింది. చికిత్సకు చేసిన అప్పు తీర్చేందుకు తన పేరిట ఉన్న రెండెకరాలు అమ్మడానికి ప్రయత్నించగా, కొడుకులు అడ్డువస్తున్నారని ఆయన మీడియాతో వాపోయారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించు కోవడంలేదని పేర్కొనారు. శంకరయ్య దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉండ గా.. అందరికీ వివాహమైంది. సుమారు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. ఇద్దరు కొడుకులకు చెరో 4 ఎకరాల భూమిని పంచి తన పేరిట 2 ఎకరాల భూమిని ఉంచుకున్నాడు.
ఇటీవల శంకరయ్య భార్య విజయకు క్యాన్సర్ నిర్ధారణ కాగా.. చికిత్స కోసం సుమారు రూ.15 లక్షల అప్పు చేశాడు. వీటిని తీర్చేందుకు శంకరయ్య తన పేరు మీద ఉన్న రెండు ఎకరాల భూమిని అమ్ముదామంటే ఇద్దరు కొడుకులు అడ్డుపడుతున్నారు.కొడుకులపై వేలేరు ఎస్సై, ధర్మసాగర్ సీఐ, కాజీపేట ఏసీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని శంకరయ్య దంపతులు వాపోయారు. ‘మీరు ఎక్కడికి పోయినా మాకు ఏం కాదని, మాకు మంత్రి పొన్నం ప్రభాకర్ అండదండలు ఉన్నాయి’ అని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.