కోదాడ, జనవరి 10 : నవమాసాలు మోసి, అల్లారు ముద్దుగా పెంచి ఉన్న ఆస్తిని తెగ నమ్మి కొడుక్కి కట్టబెడితే ఆ విశ్వాసాన్ని మరచి కన్నతల్లిని కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు గదిలో బంధించి చిత్రహింసలు పెట్టిన అమానవీయ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన ముక్కన శ్రీనివాసరెడ్డి పది రెండేండ్ల క్రితం కోదాడలో స్థిరపడి ఖమ్మం జిల్లా ముదిగొండలో వ్యాపారం చేస్తున్నాడు. శ్రీనివాసరెడ్డి తల్లిదండ్రులు సొంతూరిలో ఆస్తులమ్మి రూ.2 కోట్లతో కోదాడలో ఉంటున్న కొడుకు శ్రీనివాసరెడ్డికి రెండంతస్తుల భవనం నిర్మించి ఇచ్చారు.
రెండేండ్ల క్రితం భర్త చనిపోవడంతో.. తల్లి అన్నపూర్ణమ్మ కొడుకు వద్దే ఉంటున్నది. తన కుటుంబానికి అన్నపూర్ణమ్మ చేతబడి చేయించిందనే అనుమానంతో శ్రీనివాసరెడ్డి దంపతులు వారి కొడుకు, కూతురు 10 నెలలుగా అన్నపూర్ణమ్మను గదిలో బంధించి చిత్రహింసలు పెడుతున్నారు. శనివారం ఇంట్లో కేకలు వినపడటంతో స్థానికులు వెళ్లి ఆరాతీశారు. దీంతో అన్నపూర్ణమ్మ రోదిస్తూ కొడుకు, కోడలు, మనుమడు, మనుమరాలు చిత్రహింసలు పెడుతున్నారని.. రక్షించాలంటూ వేడుకున్నది. దీంతో వారు పోలీసులకు ఫోన్ చేయడంతో పట్టణ పోలీసులు వచ్చి శ్రీనివాసరెడ్డి, ఆయన భార్య, కొడుకుపై కేసు నమోదు చేశారు.