హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): రాబోయే రోజుల్లో ఇండ్లు, పరిశ్రమలకు సోలార్ విద్యుత్తు వినియోగాన్ని తప్పనిసరి చేసి దీనికి అవసరమైన ప్రోత్సాహకాలు కూడా అందించేలా ఆలోచన చేస్తున్నామని విద్యుత్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐలో రూఫ్‌టాప్ సోలార్, పవన విద్యుత్తుపై సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సుకు హాజరైన సునీల్ శర్మ మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుత విద్యుత్తు పరిస్థితికి సరైన సమాధానం సోలార్ ఎనర్జీ అని చెప్పారు. సోలార్ విద్యుత్తు ఆర్థికంగా కూడా సరైనదని, ఈ విద్యుత్తుపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. విద్యుత్తు ఉత్పత్తికి బొగ్గు ఎంతో కీలకమన్నారు. బొగ్గు ధర అందుబాటులో ఉండటంపై విద్యుత్తు ఉత్పత్తి ఆధారపడి ఉంటుందని వివరించారు. దీనితో ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని తెలిపారు. సదస్సులో టీఎస్ రెడ్కో ఎండీ జానయ్య, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా, పారిశ్రామికవేత్త అనిల్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.