యాదగిరిగుట్ట, మే 23: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కెమెరా, సౌం డ్ సిస్టం, వైఫైతో కూడిన అధునాతన స్మార్ట్ విద్యు ద్దీపాలను బిగించనున్నారు. మంగళవారం ఇజ్రాయిల్ దేశానికి చెందిన జగానో లైటింగ్ కంపెనీ ఎండీ అలెక్స్, ఇండియా ప్రతినిధులు కీర్తి దేశాయ్, ఈసీఐఎల్ కంపెనీ అడిషనల్ సీనియర్ మేనేజర్ శాంతయ్య, ప్రతినిధులు వేణుమాధవ్, రవీందర్‌రెడ్డి, ఆలయ ఈఈ వుడెపు రామారావు లైటింగ్ ఏర్పాటుపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటికే కొండపైన ఈవో కార్యాలయం వద్ద ఇలాంటి విద్యుద్దీపాలను బిగిం చారు. రాయగిరి నుంచి రింగురోడ్డు, ప్రధానాలయాన్ని పరిశీలించి లైటింగ్ బిగించేందుకు చేయాల్సిన ఏర్పాట్లను ఆలయ అధికా రులకు తెలిపారు.
భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వారి భద్రతను పర్యవేక్షించేందుకు ఇజ్రాయిల్‌లోని జగానో లైటింగ్ కంపెనీ ఆధ్వర్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో సుమారు 200 అత్యాధునిక విద్యుద్దీపాలు బిగించనున్నారు. స్వామివారి నిత్య కైంకర్యాలు లైట్‌లోని సౌండ్ సిస్టం ద్వారా భక్తులకు వినిపిస్తాయి. చుట్టూ ఎప్ప టికప్పుడు స్పష్టమైన సీసీ కెమెరా ద్వారా కొండపైన ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ పర్యవేక్షిస్తుంది. భక్తుడికి ఏదైనా సమస్య ఎదురైతే ఈ కెమెరా వద్దకు వచ్చి హెల్ప్.. హెల్ప్ అని చెబితే.. కమాండ్ కంట్రోల్‌కు సమాచారం వెళ్తుంది. వెంటనే పోలీసులు అప్రమత్తమై భక్తుడి వద్దకు వస్తారు. ఇలా ప్రతి భక్తుడిపై ఈ విద్యు ద్దీపాల ద్వారా నిఘా ఉంచనున్నారు. సాయంత్రం కాగానే లైట్లు వాటంతట అవే వెలుగుతాయి. ఉదయం వెలుగు రాగానే అవే ఆరిపోతాయి.