హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ఆ బాలుడి వయ సు ఆరేండ్లు.. రోజులాగే స్కూల్‌కు వెళ్లాడు. తోటి విద్యార్థులతో సరదాగా గడిపాడు. హోమ్‌వర్క్ చేయలేదని టీచర్ దగ్గరికి పిలువడంతో భయంతో వణికిపోయాడు. టీచర్ దగ్గరికి తీసుకుని చెంపపై మెల్లగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు. దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ విషాద ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.
విశాఖలోని ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థి ప్రణయ్ తేజ(6) యూకేజీ చదువుతున్నాడు. గురువారం టీచర్ పిలిచి హోమ్‌వర్క్ చూపించాలని అడిగింది. హోమ్‌వర్క్ చేయని ప్రణయ్ గజగజ వణికిపోయాడు. టీచర్ కొడుతుందేమోనని భయపడ్డాడు. ప్రణయ్‌ను దగ్గరికి పిలిచిన టీచర్ మెల్లగా చెంపపై కొట్టింది. దీంతో ప్రణయ్ అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే దవాఖానకు తరలించగా మరణించినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.