జైపూర్: జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ దవాఖానలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం వల్ల ఆరుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరింత మంది రోగుల పరిస్థితి విషమంగా ఉందని దవాఖాన అధికారులు తెలిపారు. రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ సోమవారం దవాఖానను సందర్శించి ఉన్నతస్థాయి కమిటీతో విచారణకు ఆదేశించారు. దవాఖాన ప్రకటన ప్రకారం.. న్యూరో సర్జరీ ఐసీయూ 1లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చు. ఆ సమయంలో అక్కడ 11 మంది రోగులున్నారు. ప్రమాదం జరగ్గానే అందరినీ అక్కడి నుంచి తరలించారు. కానీ అందులో ఆరుగురు చనిపోయారు.
ప్రమాద సమయంలో దవాఖాన ట్రామా సెంటర్లో మొత్తం 46 పడకలు రోగులతో నిండి ఉన్నాయి. అయితే దవాఖానలో పొగ వస్తున్నదని చెప్పినా, సిబ్బంది పట్టించుకోలేదని.. మంటలు చెలరేగిన తర్వాత.. మొదట వారే అక్కడి నుంచి పారిపోయారని రోగులు, వారి బంధువులు తెలిపారు. ఐసీయూలో ఎలాంటి అగ్నిమాపక వ్యవస్థ లేదని.. కనీసం మంటలు అర్పడానికి నీళ్లు కూడా లేవని వారు చెప్పారు. దవాఖాన సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రోగులు, వారి బంధువులు దవాఖాన ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రమాదం కారణంగా భారీగా పొగ వ్యాపించిందని.. అగ్ని మాపక వాహనాలు మంటలు ఆర్పడానికి వెంటనే వీలు కాలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయితే తాము కొందరు రోగులను రక్షించామని దవాఖాన సిబ్బంది తెలిపారు. ఫోరెన్సిక్ టీమ్ దర్యాప్తులో ప్రమాదానికి గల కారణం తెలుస్తుందని జైపూర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ తెలిపారు.