నల్లగొండ: నల్లగొండ జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో (Road Accident) ఆరుగురు మృతిచెందారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో నిడమనూరు (Nidamanuru) మండలంలో వెంపాడు స్టేజి వద్ద నడుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఓ బైకు ఢీకొట్టింది. దీంతో బైకర్ కేశవులుతోపాటు పాదచారి సైదులు మృతిచెందారు. కేశవులు మరణవార్త తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు పెద్దవూర మండలం మల్లెవాని కుంట తండా నుంచి ఆటోలో ప్రమాద స్థలికి బయల్దేరారు. ఈ క్రమంలో పార్వతీపురం వద్ద వారి ఆటోను ట్యాంకర్ ఢీకొట్టింది.
Also Read>> నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల ఘటనలపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతులను గుణ్య, నాగరాజు, పాండ్య, బుజ్జిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో మల్లెవానికుంటలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.