Meerpet Rape Case | హైదరాబాద్‌లోని మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 16 ఏండ్ల బాలికపై లైంగిక దాడి కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశామని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ డీఎస్ చౌహాన్ చెప్పారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్పారు. ప్రధాన నిందితుడు మంగళ్‌హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్‌గా ఉన్నాడని మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో నిందితులపై పోక్సో చట్టం, సెక్షన్ 5జీ రెడ్ విత్ 6 కింద కేసులు నమోదు చేశామన్నారు.
ఆ బాలికపై అష్రఫ్, చిన్నా, తహిసీన్, మహేష్ అనే నలుగురు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడి చేసిన తర్వాత రేస్ కోర్స్ వెనుక వైపు ఉన్న ఫైజల్, ఇమ్రాన్ దగ్గరికి వెళ్లారని చౌహాన్ చెప్పారు. వారి మొబైల్ ఫోన్లతో రెండు, మూడు కాల్స్ చేసి డిలిట్ చేసి, అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. ఉమ్నాబాద్ వరకూ వెళ్లిన నిందితులు.. అక్కడ రెండు పోలీసు టీమ్‌లు గస్తీ తిరుగుతుండటంతో వారు వెనక్కి వచ్చారు. హైదరాబాద్ నగరంపై అవగాహన గల వారిని పట్టుకోవడానికి 12 టీమ్‌లను రంగంలోకి దించి, సిటీలో వేర్వేరు చోట్ల వారిని అదుపులోకి తీసుకున్నామని సీపీ చౌహాన్ తెలిపారు.
లాల్ బజార్ వాసి అయిన బాలిక (16) తల్లిదండ్రులు గతంలో మరణించడంతో 15 రోజుల క్రితం తన తమ్ముడు (14)తో కలిసి మీర్‌పేటలోని ఓ కాలనీలోని తమ సమీప బంధువు అక్క ఇంట్లో ఆశ్రయం పొందుతున్నారు. ఆ బాలిక దిల్సుఖ్నగర్ లోని ఒక బట్టలషాపులో పని చేస్తుండగా, ఆమె తమ్ముడు ప్లెక్సీలు కడుతుంటాడు.
సోమవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆ బాలిక తన సోదరుడు, మరో ముగ్గురు చిన్నారులతో కలిసి ఇంట్లో ఉన్నప్పుడు ఎనిమిది మంది నిందితులు ఇంట్లోకి చొరబడ్డారు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న నిందితుల్లో నలుగురు ఆ బాలిక మెడపై కత్తి పెట్టి బెదిరించారు. అదే భవనంలోని మూడో అంతస్తులోకి ఆ బాలికను తీసుకెళ్లారు.
మిగతా నలుగురు ఆమె తమ్ముడు, అక్కడ ఉన్న చిన్నారులపై బెదిరింపులకు దిగారు. పైకెళ్లిన నిందితుల్లో ముగ్గురు ఆ బాలికను కత్తితో బెదిరిస్తూ ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంగతి తెలిసిన బాధితురాలి సోదరి.. మీర్ పేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ బాలికకు వైద్య పరీక్షల తర్వాత.. సఖి కేంద్రానికి తరలించారు.