హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు బండి సంజయ్ అనుచరుడు భూసారపు శ్రీనివాస్‌కు నోటీసులు జారీచేశారు. అధికారులు గురువారం కరీంనగర్‌లోని శ్రీనివాస్ ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉన్నది. దీంతో తలుపునకు నోటీసులు అంటించారు. ఈ నెల 21వ తేదీన ఉదయం 10:30 గంటలకు సిట్ ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడైన సింహయాజి తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి టికెట్‌ను శ్రీనివాసే బుక్ చేసినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాల్సిందిగా సిట్ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.