కొడంగల్, డిసెంబరు 12 : నా తమ్ముడు ఏనాడూ ఎవరికీ ఎటువంటి కీడూ చెయ్యలే. మా తల్లిలాంటి భూమిని మాకు కాకుండ చెయ్యాలని చూస్తే ప్రశ్నించిండు. ఇద్దరు ఆడబిడ్డల నడుమ ఒక్కడే మాకు. వానికి చిన్న పిల్లలున్నరు. నా తమ్ముడికి ఏమన్న జరిగితే మేమంత ఎట్ల బతుకుడు?’ అని హీర్యానాయక్ సోదరి శాంతిబాయి ఆవేదన వ్యక్తంచేసింది. భూమినే నమ్ముకొని బతుకుతున్నామని, భూమి పోతే తమకు ఏ అధారం లేదని కన్నీటిపర్యంతమైంది. తన తమ్ముడికి హఠాత్తుగా గుండెపోటు వచ్చిందని తెలిసి పులిచెర్లకుంటతండాలో ఉన్న శాంతిబాయి తీవ్రంగా రోదించింది. లగచర్ల ఘటనలో తన తమ్ముడిని పోలీసులు పట్టుకుపోయారని, 15 రోజుల్లో ఇంటికి వస్తడన్నారని, తన కోసం పిల్లలు ఏడుస్తూ ఎదురుచూస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంది.
‘సీఎంకు ఫ్యాక్టరీలు పెట్టుకోవాలంటే మా పేదల భూములే కావాల్నా? ఎకరం, రెండు ఎకరాల్లో పంటలు పండించుకొని మా మానాన మేము బతుకుతున్నం. సెంటు భూమి కూడా వదులుకునేది లేదు. రేవంత్రెడ్డి సీఎం అయితే మా బతులు బాగైతయనుకున్నం. ఇట్ల చేస్తడని కలలో కూడా అనుకోలేదు’ అంటూ ఆక్రోశం, ఆవేదన వెలిబుచ్చింది. ‘ఆ రోజు కలెక్టర్ వచ్చిన సమయంలో నా తమ్ముడు అక్కడ లేడు. పనికిపోయిండు. రాత్రి వచ్చి అన్నం తిని పడుకున్నడు. పొద్దుగాల జరిగినవేవీ తనకు తెలియవు. ఒంటిగంట రాత్రి పోలీసులు వచ్చి కరెంట్ బంద్ పెట్టి ఇంట్ల నుంచి పట్టుకపోయిండ్రు. ఇయాల్టికి న్లైతాంది. ఎక్కడున్నడో తెల్వది. ఇన్ని ఇబ్బందులు ఎందుకు పెడుతున్నరో! ఓటేసినందుకు ఈ బాధనా? గెలిపించినందుకు ఈ బాధనా? నా తమ్ముడు ఏం నేరం చేసిండు? ఎవరినైనా మర్డర్ చేసిండా?’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది.