సిరిసిల్ల రూరల్, జూన్ 12 : రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. కలెక్టర్ ఆదేశాలతో గురువారం సిరిసిల్ల సింగిల్‌విండో చైర్మన్ బండి దేవదాస్గౌడ్కు చెందిన రేకుల షెడ్డును కూల్చేశారు. ఈ స్థలంపై హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ పట్టించుకోకుండా తహసీల్దార్ జయంత్‌కుమార్ ఎక్సకవేటర్‌తో కూల్చేయడం చర్చనీయాంశమైంది.
తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన విండో చైర్మన్ దేవదాస్‌గౌడ్ అదే గ్రామంలో సర్వే నెం.374లో 3.25 ఎకరాలు ప్రభుత్వ భూమిని సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసుకుని, పీవోటీ యాక్ట్ ప్రకారం తనపేరిట పట్టాచేసుకున్నాడు. అదే స్థలంలో రేకులషెడ్డును గ్రామపంచాయతీ అనుమతితో నిర్మించుకున్నారు. ప్రభుత్వభూమిని కబ్జా చేశారంటూ జనవరిలో దేవదాస్‌పై కేసునమోదుచేసి, జైలుకు పంపిన విషయం తెలిసిందే.
ఆ సమయంలోనే ఆ భూమిని ఆన్‌లైన్‌లోంచి తొలగించడం గమానార్హం. బెయిలుపై వచ్చిన దేవదాస్‌గౌడ్ హైకోర్టును ఆశ్రయించగా స్టేఅర్డర్ ఇచ్చింది. స్టేఆర్డర్ ఈ నెల 26 వరకు ఉన్పప్పటికీ ఎలాంటి నోటీస్‌లు ఇవ్వకుండా గురువారం తహసీల్దార్ జయంత్‌కుమార్, సిబ్బందితో కలిసి రేకులషెడ్డును తొలగించారు. కోర్టు ఆర్డర్‌ను ధిక్కరించి, తన షెడ్డును కూల్చేయడంపై న్యాయపోరాటం చేస్తామని దేవదాస్‌గౌడ్ పేర్కొన్నారు.
కలెక్టర్ ఆదేశాలతో ఆరునెలల కిందటే భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని, బండి దేవదాస్‌పై కేసు నమోదుచేశాం. షెడ్డును తొలగించాలని సూచించాం. రెండు రోజుల క్రితం జరిగిన రెవెన్యూసదస్సులో గ్రామస్థులు సైతం ప్రభుత్వ భూమిలో షెడ్డు తొలగించాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రేకులషెడ్డును తొలగించాం. హైకోర్టు స్టే ఆర్డర్‌కు దీనికి సంబంధం లేదు. అవసరమయితే రిమార్క్ రాసి పంపుతాం.
– జయంత్‌కుమార్, తహసీల్దార్, తంగళ్లపల్లి