కరీంనగర్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే రెవెన్యూ దరఖాస్తులను ఎలా రిజెక్ట్ చేస్తారని సిరిసిల్ల అదనపు కలెక్టర్.. అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రెవెన్యూ దరఖాస్తులు లక్షకుపైగా రిజెక్ట్?’ శీర్షికన 15న ‘నమస్తే తెలంగాణ’ మెయిన్‌లో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. పైనుంచి ఒత్తిళ్లు, జరిగిన తప్పులు, తద్వారా రైతులకు జరిగిన అన్యాయం, దరఖాస్తుల తిరస్కరణ వంటి అంశాలను కండ్లముందుంచడం కలకలం రేపింది. దీంతో రాష్ట్ర సర్కారు దరఖాస్తులపై స్పందించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నతాధికారులను వివరాలు అడిగినట్టుగా తెలుస్తుండగా.. శుక్రవారం సిరిసిల్ల అదనపు కలెక్టర్ భీమ్యానాయక్ తన చాంబర్లో ఆర్డీవోలు, తహసీల్దార్లతో హడావిడిగా సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలువురు తహసీల్దార్ల తీరుపై ఆగ్రహించినట్టు తెలిసింది.
క్షేత్రస్థాయిలో ఏ మాత్రం పరిశీలన చేయకుండా దరఖాస్తులు ఎలా రిజెక్ట్ చేస్తారని ప్రశ్నించినట్టు సమాచారం. ప్రతి మండలంలో ఎన్ని దరఖాస్తులను తిరస్కరించారన్న వివరాలు తెలుసుకోవడంతోపాటు అందుకు కారణాలను అడిగినట్టు తెలిసింది. మెజార్టీ తహసీల్దార్లు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేసినట్టు రెవెన్యూ అధికార వర్గాల ద్వారా సమాచారం. త్వరితగతిన పనులు చేయించడంలో భాగంగా పైఅధికారుల నుంచి ఒత్తిడి వస్తుందని, అంత మాత్రాన రిజెక్ట్ చేసి పరిష్కరించినట్టు చూపడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నించినట్టు తెలిసింది. వీటిపై పూర్తి వివరాలు తీసుకొని, తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్టు సమాచారం.