శ్రీశైలం: అగ్గిపెట్టలో ఇమిడే అరుదైన పట్టుచీర(Silk Saree)ను .. శ్రీశైల భ్రమరాంబకు చేనేత కార్మికుడు సమర్పించాడు. సిరిసిల్లకు చెందిన ఆ నేతన్న మంగళవారం ఆ చీరను ధర్మకర్తల మండలి అధ్యక్షుడు శ్రీ పోతుగుంట రమేష్ నాయుడికి అందజేశారు. చేనేత కళాకారుడు కళారత్న నల్ల విజయ్ కుమార్ ఆ చీరను రూపొందించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు కోడె కాంతివర్ధిని కూడా పాల్గొన్నారు. అద్భుత కళాకృతితో తీర్చిదిద్దిన ఆ అరుదైన చీర సుమారు 5.5 మీటర్ల పొడుగు, 48 ఇంచుల వెడల్పుతో ఉన్నది. సుమారు 200 గ్రాముల బరువు ఉన్నట్లు తెలిపారు. సంప్రదాయకరమైన ఇక్కత్ డిజైన్లో చీరను రూపొందించారు. అయితే ఈ చీరను చుట్టినప్పుడు.. అది చిన్న అగ్గిపెట్టలో కూడా ఇమిడిపోతుందని చేనేత కళాకారుడు విజయ్ కుమార్ తెలిపారు. అమ్మవారి కృపతోనే ఈ అరుదైన వస్త్రాన్ని రూపొందించడం జరిగిందని ఆయన తెలిపారు. దేవస్థానం కళారత్న విజయ్ కుమార్ ప్రతిభను రమేష్ నాయుడు అభినందించారు.