Sircilla | సిరిసిల్ల రూరల్, మార్చి 7: సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులపై కక్షగట్టిన అధికార యంత్రాంగం మరో కుతంత్రానికి తెరలేపినట్టు తెలుస్తున్నది. నియోజకవర్గంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సమాచారం. నియోజకవర్గంలోని పది పీఏసీఎస్‌లలో తొమ్మిదింటిలో బీఆర్ఎస్ పార్టీకి చెందినవారే చైర్మన్లుగా ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై అకసుతోపాటు పీఏసీఎస్‌లన్నీ బీఆర్ఎస్ శ్రేణుల చేతిలో ఉండటం వల్లనే యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు అప్పజెప్పేందుకు ఓ ఉన్నతాధికారి ఐకేపీ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. దీంతో ఐకేపీ అధికారులు సింగిల్‌విండోలు నిర్వహించే కేంద్రాల స్థానంలో మహిళా సంఘాలను సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఇలా జరిగితే తమ పరిస్థితి ఏంటని సింగిల్‌విండో పాలకవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కేటీఆర్‌పై అకసుతో సింగిల్‌విండోలను దెబ్బతీయడం సరికాదని చైర్మన్లు వాపోతున్నారు.
బీఆర్ఎస్పై కక్షతోనే
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సింగిల్‌విండో పాలకవర్గాలను ఆరు నెలలపాటు పొడిగిస్తూ. ఉత్తర్వులు జారీచేసింది. సిరిసిల్ల జిల్లాలో తొమ్మిది మంది చైర్మన్లు బీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఉండటంతో ఏకంగా కొనుగోలు కేంద్రాలను ఊడగొట్టాలని చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొమ్మిది మంది చైర్మన్లలో ఇద్దరిపై భూ ఆక్రమణ కేసులుపెట్టి జైలుకు పంపించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఇటీవల సిరిసిల్ల కేంద్రంలో కేటీఆర్ ఫొటో ఉన్న ఫ్లెక్సీ ఉన్నందుకు అధికారులు ఓ టీస్టాల్‌ను మూసివేయించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవల బీఆర్ఎస్ నాయకులతోపాటు జిల్లెల్లలో సామాన్య రైతు రాజిరెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపారు.
ఆలోచనను విరమించుకోవాలి
సింగిల్‌విండో కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసే ఆలోచనను అధికారులు విరమించుకోవాలి. కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలి. గతంలో మహిళా సంఘాల సభ్యులు తాము నిర్వహించలేమని.. నిర్వహణ భారంతో ఇబ్బందిపడి కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నారు. తర్వాత సింగిల్‌విండోలకు అప్పగించారు. అప్పటినుంచి రైతుల వద్దనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేవలందించాం. రైతులకు అందుబాటులో ఉన్న సొసైటీ కేంద్రాలను ఎత్తివేయవద్దు. రైతులను ఇబ్బందులకు గురిచేసే ఆలోచనను విరమించుకోవాలి.
– దేవదాస్‌గౌడ్, సింగిల్ విండో చైర్మన్ (సిరిసిల్ల)