(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా చరిత్ర సృష్టించారు. అయన ప్రయాణిస్తున్న డ్రాగన్ వ్యోమనౌక ‘గ్రీస్’.. ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. గురువారం సాయంత్రం 4.01 గంటల ప్రాంతంలో మొదలైన ఈ డాకింగ్ ప్రక్రియ 4.15 గంటలకు విజయవంతంగా ముగిసింది. అనంతరం వివిధ సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేసుకొని సాయంత్రం 5.44 గంటలకు ముగ్గురు వ్యోమగాములతో కలిసి శుభాన్షు ఐఎస్ఎస్లోకి అడుగు పెట్టారు.
అలా ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. శుభాన్షు బృందానికి స్టేషన్లో ఉన్న వ్యోమగాములు స్వాగతం పలికారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్లో బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ప్రయోగించిన స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ నిప్పులు చిమ్ముతూ విజయవంతంగా రోదసిలోకి వెళ్లడం తెలిసిందే.
రాకెట్ నుంచి విజయవంతంగా విడిపోయిన శుభాన్షు ప్రయాణిస్తున్న క్యాప్సుల్ 28 గంటల ప్రయాణం తర్వాత గురువారం సాయంత్రం ఐఎస్ఎస్తో అనుసంధానం అయ్యింది. అట్లాంటిక్ మహా సముద్రం మీద డాకింగ్ ప్రక్రియ జరిగినట్టు నాసా ఒక ప్రకటనలో వెల్లడించింది. శుభాన్షుతో పాటు అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, హంగరీకి చెందిన టిబర్ కపు, పోలండ్‌కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ-విస్నియెస్కీ ఐఎస్ఎస్లోకి అడుగు పెట్టారు. 14 రోజులపాటు వీరందరూ అక్కడే 60కి పైగా శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించనున్నారు.
ఐఎస్ఎస్తో డాకింగ్ ప్రక్రియ పూర్తికాకముందు వ్యోమనౌకలో ఉన్న శుభాన్షు లైవ్‌కాల్‌లో మాట్లాడారు. రోదసిలో ప్రయాణం చాలా అద్భుతంగా ఉందన్న ఆయన భారరహిత స్థితిలో ఎలా నడవాలన్న విషయాన్ని చిన్న పిల్లాడి మాదిరిగా నేర్చుకొంటున్నట్టు చెప్తూ మురిసిపోయారు. ‘ఇదో గొప్ప ప్రయాణం. నెలరోజుల క్వారంటైన్ తర్వాత ఐఎస్ఎస్కు చేరుకోబోతున్నాం. భారరహిత స్థితికి ఇప్పుడిప్పుడే అలవాటుపడుతున్నా. అంతరిక్షంలో ఎలా నడవాలి? ఎలా ఆహారం తీసుకోవాలి? ఇలా ప్రతీ విషయాన్ని ఓ చిన్న పిల్లాడిలా నేర్చుకొంటున్నా. నా భుజంమీద ఉన్న మువ్వన్నెల జెండాను చూస్తున్నప్పుడు కోట్లాది మంది భారతీయులు నాకు తోడుగా ఉన్నారనే భావన కలుగుతున్నది’ అంటూ శుభాన్షు వీడియోలో ఆనందం వ్యక్తం చేశారు.
డాకింగ్ ప్రక్రియ విజయవంతం కావడంతో శుభాన్షు తల్లిదండ్రులు శంభు, ఆశా శుక్లాతో పాటు ఆయన బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. డాకింగ్ ప్రక్రియకు సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్‌ను లక్నోలోని మాంటెసరీ స్కూల్లో వీక్షించారు. ఐఎస్ఎస్లోకి శుభాన్షు అడుగుపెట్టగానే అక్కడ పండుగ వాతావరణం నెలకొన్నది. దేశవ్యాప్తంగా పలువురు శుభాన్షుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
రోదసిలోకి వెళ్లిన వ్యోమగాముల్లో శుభాన్షు శుక్లా 634వ వ్యక్తి. ఈ మేరకు ఐఎస్ఎస్లోకి వెళ్లగానే ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘నేను 634వ వ్యోమగామిని. ఇక్కడికి రావడాన్ని గౌరవంగా భావిస్తున్నా. వచ్చే 14 రోజుల్లో ఐఎస్ఎస్లోనే మేం కొన్ని ప్రయోగాలు చేయబోతున్నాం. మా ప్రయాణంలో ఇది తొలి అడుగు’ అని శుభాన్షు పేర్కొన్నారు. ఐఎస్ఎస్ను ఇప్పటివరకూ 23 దేశాలకు చెందిన దాదాపు 280 మంది వ్యోమగాములు సందర్శించారు.