గంభీరావుపేట, మే 24 : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ 11కేవీ విద్యుత్తు లైన్లో ఆదివారం షార్ట్సర్యూట్ జరిగింది. దీంతో 150 ఎకరాల్లో పశుగ్రాసంతోపాటు వ్యవసాయ బావులు, మోటర్లకు సంబంధించిన మోటరు కేబుళ్లు, పైపులు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనతో తాము తీవ్రంగా నష్టపోయామని, తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు గంభీరావుపేటలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట కామారెడ్డి-సిద్దిపేట రోడ్డుపై బైఠాయించారు.
తామే మంటలు ఆర్పుతూ పంట పొలాల వద్ద కట్టేసిన పశువులను కాపాడుకున్నట్టు చెప్పారు. ఇంత ప్రమాదం జరిగినా ఇప్పటివరకు విద్యుత్తు అధికారులు ఘటనా స్థలానికి రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.