పాలకుర్తి, మే 27: బుక్కెడు బువ్వ కోసం ఠాణా మెట్లెక్కింది ఓ అవ్వ. తన భర్తతో కలిసి యుక్త వయసులో సంపాదించిన ఆస్తులన్నింటినీ కొడుకుల పేర చేసి ఇప్పుడు అనాథ అయ్యింది. కొడుకులు, కోడండ్లు ఉన్నా.. చేతకాని వయసులో తనకు ఆకలి బాధ తప్పడం లేదని అమీన్ సాబ్ ఎదుట వాపోయింది. ‘నా కన్నకొడుకులతో నాకు బుక్కెడు బువ్వ పెట్టించండి.. బాంచెన్ మీ కాల్మొక్తా..’ అంటూ వేడుకున్నది. ఓ పండు ముసలి కాలే కడుపు పట్టుకుని మండుటెండలో ఠాణా మెట్లెక్కిన ఘటన పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. ‘నా పేరు గణపతి కృష్ణమ్మ.
నా వయస్సు 85 ఏండ్లు ఉంటది. మాది పాలకుర్తి మండలం కన్నాల గ్రామం. నాకు నలుగురు కొడుకులు, కూతురు ఉంది. అందరికీ పెండ్లీలు అయ్యి.. వేర్వేరుగా ఉంటున్నారు. నా పెనిమిటి, నేను సంపాదించిన కోట్ల విలువైన ఆస్తులన్నీ నా కొడుకులు పంచుకున్నరు. నా పెనిమిటి కొన్నేండ్ల క్రితం కాలం చేసిండు. అప్పటి నుంచి వంతుల వారీగా సాకిన నా కొడుకులు.. ఇప్పుడు దిక్కులేని దాన్ని చేసింన్రు. అడుక్కుతినే దానిలా చూస్తున్నరు’ అంటూ సోమవారం ఠాణాకు వచ్చిన ఆ పండు ముసలి ఎస్సైలు స్వామి, శివాణిరెడ్డి ఎదుట కన్నీరు పెట్టుకున్నది. తర్వాత ఎస్సై శివాణిరెడ్డి కృష్ణమ్మ కొడుకులను ఠాణాకు పిలిపించారు. వారితో మాట్లాడి కన్నతల్లి పోషణను బాధ్యతగా తీసుకోవాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.